Charminar: చార్మినార్ నమాజ్ ఎపిసోడ్‌కు రాజకీయ రంగు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Charminar: చార్మినార్‌లో నమాజ్ కోసం లోకల్ కాంగ్రెస్ లీడర్లు చేపట్టిన సంతకాల సేకరణ వివాదంగా మారుతోంది.. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలను ఓర్చుకోలేకే చార్మినార్‌లో నమాజ్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది.. అటు బీజేపీని కార్నర్ చేస్తూ కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలు కూడా కౌంటర్లు ఇస్తున్నాయి.
16వ శతాబ్దపు కట్టడమైన చార్మినార్ పైభాగంలో ఉన్న మసీదులో మళ్లీ ప్రార్థనలు చేసేందుకు అనుమతించాలని కాంగ్రెస్ మైనార్టీ నేత, టీపీసీసీ కార్యదర్శి రషీద్ ఖాన్ సంతకాల సేకరణ మొదలు పెట్టారు.. ప్రార్థనల కోసం చార్మినార్‌ను తెరవడానికి అనుమతించాలని రషీద్ ఖాన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా చార్మినార్‌లో ప్రార్థనలు చేసుకోడానికి అనుమతించాలని రషీద్ ఖాన్ కోరారు.
అయితే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇదే విషయంపై విజ్ఞప్తి చేయగా.. శాంతి భద్రతల సమస్యను ఆయన ప్రస్తావించారని రషీద్ ఖాన్ చెప్పుకొచ్చారు.. అందరి సంతకాలతో సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తానని.. పరిష్కరించకుంటే ప్రగతి భవన్ వద్ద ఆందోళన చేస్తానని రషీద్ ఖాన్ అన్నారు.. అయితే, చార్మినార్‌లో నమాజ్ అంశాన్ని ప్రస్తావిస్తూనే దానికి ఆనుకుని వున్న భాగ్యలక్ష్మి ఆలయంపై రషీద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది.
భాగ్యలక్ష్మి ఆలయం అనధికార కట్టడమని, ఆలయంలో ప్రార్థనలకు అనుమతించినప్పుడు చార్మినార్‌లో సైతం ముస్లింల ప్రార్థనలకు అనుమతించాలంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి చార్మినార్ పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది.. దీంతో ఇక్కడ ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదు.. దీంతోపాటు కొన్నాళ్ల క్రితం చార్మినార్ పైనుంచి ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.. దీంతో అప్పట్నుంచి చార్మినార్ సందర్శన నిలిపివేశారు అధికారులు..
మరోవైపు చార్మినార్ పక్కనే ఉన్న మక్కా మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. చార్మినార్‌లో అవసరం లేదనే అభిప్రాయంతో అక్కడ నిలిపివేశారు.. అప్పట్లో దీనిపై ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.. మళ్లీ ఇప్పుడు చార్మినార్‌లో ప్రార్థనల కోసం కాంగ్రెస్ నేత చేపట్టిన సంతకాల సేకరణతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అటు కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయంపై చేయి వేయాలంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.. మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే మీకు నమాజ్ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్‌ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయంటూ విరుచుకుపడ్డారు. ఇక బండి సంజయ్ విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు.. చార్మినార్ ఒక మతానికి సంబంధించింది కాదని.. అది హైదరాబాద్ ప్రజలదని మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు.. బీజేపీ పిచ్చి ప్రయత్నాలకు మేం బెదరబోమని, ఒంటరిగా చార్మినార్‌కు వస్తా.. దమ్ముంటే రా తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com