ఐడియా అదిరింది గురూ.. బండి మీదే బెస్ట్ రెస్టారెంట్..

భాస్కర్‌కి బజాజ్ చేతక్ బండి ఉంది. మెదడులో మంచి ఐడియా ఉంది. ఇంకేం ఎదిరించే వారెవరు. అనుకున్నదే తడవుగా ఐడియాకు రూపకల్పన చేశాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడితేనే బతగ్గలం అని ఎవరో చెప్పిన బ్రతుకు పాఠాలు గుర్తుకొచ్చాయి.
అంతకుముందు కారు డ్రైవర్‌గా స్టీరింగ్ తిప్పిన చేతులు.. ఇప్పుడు గరిటె తిప్పుతూ ఘుమ ఘుమలాడే వంటలు తయారు చేస్తున్నాడు.. పాదచారుల ముక్కు పుటాలను తాకుతున్న ఆ మసాలా వాసన ఆయన బిజినెస్‌ను పెంచేసింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన భాస్కర్ పదేళ్ల క్రితం భాగ్యనగర్ బంజారా హిల్స్ ప్రాంతంలోని వెంకటగిరి ప్రాంతంలో నివసిస్తున్నాడు.
కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అన్నీ సవ్యంగా జరిగితే అనుకోవాల్సింది ఏముంటుంది. కరోనా దెబ్బతో కారు మూలపడింది. బతుకు బండి దారి తప్పింది. ఏం చేయాలో దిక్కు తోచని స్థితి. ఖాళీగా కూర్చుంటే కాలం ఆగదు.
రోజులు గడవడానికి ఏదో ఒకటి చేయాలి అని తనకు తానే ధైర్యం తెచ్చుకున్నాడు. కొత్త బిజినెస్‌కు ఐడియా చేసాడు. వంట తెలిసి ఉండడం అతడి ప్లస్ పాయింట్ అయిందే.. అదే తన వ్యాపారానికి మార్గం సుగమం చేసింది.
తన దగ్గర ఉన్న సొమ్ముతో ఓ పాత స్కూటర్, వంట సామాగ్రి కొన్నాడు. మాదాపూర్ ఐటీ కారిడార్‌ని తన బిజినెస్ అడ్డాగా మార్చుకున్నాడు. స్కూటర్‌ని వ్యాపారానికి అనువుగా మార్చుకునేందుకు దాదాపు లక్షన్నర వరకు ఖర్చుపెట్టి దానిపైనే బార్బిక్యూ వంటకాలను తయారు చేసి పాదచారులకు వేడి వేడిగా అందిస్తున్నాడు.
రోజుకు ఆరేడు వేల వరకు బిజినెస్ చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వారాంతాల్లో నా బిజినెస్ మరింత బ్రహ్మాండంగా ఉంటుంది.. మరి కొన్ని డబ్బులు వస్తాయి అని ఆనందంగా చెబుతున్నాడు భాస్కర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com