1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న భట్టి పీపుల్స్‌ మార్చ్‌

1000 కిలోమీటర్లు పూర్తి చేసుకోనున్న భట్టి పీపుల్స్‌ మార్చ్‌
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ మరో మైలురాయికి చేరువైంది. భట్టి పాదయాత్ర ఇవాళ వెయ్యి కిలోమీటర్లను పూర్తి చేసుకోనుంది

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ మరో మైలురాయికి చేరువైంది. భట్టి పాదయాత్ర ఇవాళ వెయ్యి కిలోమీటర్లను పూర్తి చేసుకోనుంది. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైన యాత్ర...29 నియోజకవర్గాల మీదుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు.

భట్టి విక్రమార్క తన పాదయాత్ర ద్వారా పట్టణాలు, పల్లెలు, తండాలను చుట్టేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రైతులు, కల్లుగీత కార్మికులు.. మత్స్యకారులు, గొర్రెల కాపర్లు, చిరు వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ .. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ భరోసా కల్పిస్తున్నారు. మార్పు లక్ష్యంగా.. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు చూడాలంటూ భట్టి ప్రచారం చేస్తున్నారు.

ఆదిలాబాద్ నుంచి దేవరకొండ దాకా మొత్తంగా 29 నియోజకవర్గాల్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో ఇప్పటివరకూ ఎవరు తరిచిచూడని అనేక అంశాలను భట్టి విక్రమార్క నేరుగా పరిశీలించారు. అందులో ప్రధానంగా తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసే అనేక ప్రాజెక్టులను.. వాటి పరిస్థితులను భట్టి విక్రమార్క నేరుగా పరిశీలన చేశారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలు పెట్టినవి, మధ్యలో నిలిచినవి, పూర్తయినా.. కాల్వలు లేని అనేక ప్రాజెక్టులను భట్టి విక్రమార్క వాటి దగ్గరకు వెళ్లి మరీ పరిశీలించారు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క... ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ పెద్దవాగు ప్రాజెక్టును, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్టును, చెన్నూరు నియోజకవర్గంలోని గొల్లవాగు ప్రాజెక్టును, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. పరిగి నియోజకవర్గంలో లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ ప్రాంతాన్ని, అచ్చంపేట నియోజకవర్గంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ను భట్టి విక్రమార్క నేరుగా పరిశీలించారు. అలాగే కాళేశ్వరం ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్, ఉద్దండాపూర్ రిజర్వాయర్, వట్టెం ప్రాజెక్టు, డిండి నక్కల గండి రిజర్వాయర్లను భట్టి పరిశీలించారు. నిర్వాసితులతోనూ నేరుగా సమావేశమై వారు గోడును తెలుసుకున్నారు.

కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తిచేయడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం.. అలాగే కేసీఆర్ సర్కార్‌ చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్వాసితులను రోడ్డున పడేయడం వంటి అనేక అంశాలను పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భట్టి విక్రమార్క ఎత్తి చూపారు. ప్రధానంగా వట్టెం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న ఐదు గ్రామాలు గిరిజన, దళితులవే. వీరెవ్వరికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వలేదు. తూతూమంత్రంగా పరిహారం ఇచ్చి గిరిజన, దళితులను వట్టెం ప్రాజెక్టు పునాదుల్లో కలిపేశారని భట్టి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నిర్వాసితులపై కేసీఆర్ ఒంటెత్తు పోకడలు, నియంతల పనితీరును భట్టి విక్రమార్క పాదయాత్రలో అడుగడుగునా ఎత్తి చూపారు.. ప్రశ్నించారు.. బాధితులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ధైర్యం చెప్పారు. మరో ఆరు నెలల్లో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటూ.. అప్పుడు మీకు సరైన నష్టపరిహారం ఇస్తామంటూ.. బాధిత నిర్వాపితులకు భట్టి మరొధైర్యాన్ని, భరోసాను కల్పించారు.

బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల్లో బొగ్గు గనులను పరిశీలించి.. సింగరేణికి పూర్వ వైభవం తీసుకొస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు భట్టి విక్రమార్క. రామగుండం, ధర్మపురి, హజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నకేట నియోజకవర్గాల్లో ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతన్నలకు ధైర్యం చెప్పారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. యాదాద్రి ఆలయం కొత్తగా నిర్మాణం జరిగాక కొండపైకి ఆటోలను అనుమతించడం లేదు. దీంతో కొండపైకి ఆటోలను అనుమతించాలని ఏడాదిగా దీక్షలు చేస్తున్న కార్మికుల శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు భట్టి విక్రమార్క.

ఉత్తర తెలంగాణలోని బోథ్, ఖానాపూర్, ఆసిఫా బాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ నియోజకవర్గాలలో భట్టి తన పాదయాత్ర పూర్తి చేశారు. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ భట్టి యాత్ర జోరుగా సాగుతోంది. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లా మీదుగా జడ్చర్ల చేరుకుంది భట్టి విక్రమార్క పాదయాత్ర. జడ్చర్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.ఈ సభకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఈ సభా వేదిక నుంచి హస్తం నేతలు ఎండగట్టారు.

జడ్చర్ల నుంచి నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట మీదుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చేరుకున్న భట్టి పాదయాత్ర.. దేవరకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ నెలాఖరులో భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు రోజు భారీ సభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు ప్రియాంక గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా టీ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తుంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభతో పీపుల్స్ మార్చ్ ను ముగించనున్నారు భట్టి విక్రమార్క.

Tags

Read MoreRead Less
Next Story