BC Reservations: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల సవరణలకు గవర్నర్ ఆమోదించారు. దీంతో 42% బీసీ కోటా అమలుకు మార్గం సుగమం అయింది. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర అసెంబ్లీ ఆగస్టు 31న ఏకగ్రీవంగా ఆమోదించిన తెలంగాణ పంచాయతీరాజ్ (తృతీయ సవరణ) బిల్, 2025 , తెలంగాణ మున్సిపాలిటీలు (తృతీయ సవరణ) బిల్, 2025లకు సెప్టెంబర్ 10న అసెంట్ ఇచ్చారు. ఈ సవరణలు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42% కోటాను అమలు చేయడానికి 50% మీద పడే మొత్తం రిజర్వేషన్ పరిమితిని తొలగించినట్లయింది. గెజిట్ విడుదలకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇటీవలే అసెంబ్లీలో రెండు సవరణ బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రభుత్వం పంపిన బిల్లులకు సెప్టెంబర్ 9వ తేదీన గవర్నర్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదముద్రతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు అవకాశం ఉంది.
కీలక సమయంలో...
గ్రామ పంచాయతీలలో రిజర్వేషన్లను ఖరారు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిర్ణయించిన గడువు సెప్టెంబర్ నెలతో ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. జూలై చివరి నాటికి రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసి, సెప్టెంబర్ 30 నాటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని సవరించాలనే పంచాయతీ రాజ్ శాఖ ప్రతిపాదనను న్యాయ శాఖ ఆమోదించింది. తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో శాసనసభ ఆమోదించింది. గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. దీంతో ప్రభుత్వం పంపిన బిల్లులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో రేవంత్ హామీ
2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీలలో బీసీ రిజర్వేషన్లను పెంచడం ఒకటి. మార్చిలో, రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన ఆధారంగా విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. అయితే, రాష్ట్రం చేసిన అభ్యర్థనకు కేంద్రం ఇంకా స్పందించకపోవడంతో, పెరిగిన బీసీ కోటాతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ఆర్డినెన్స్ జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ నిర్ణయించింది. కుల గణన డేటా ఆధారంగా, బీసీ కోటాను పెంచడానికి అసెంబ్లీ బిల్లులను ఆమోదించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రభుత్వం ఇప్పుడు మరిన్ని చర్యలు తీసుకుంటోంది. రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు లైన్ క్లియర్ అయ్యింది.
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు 42% కోటా ఇస్తామని వాగ్దానం చేసింది. బీఆర్ఎస్ పాలనలో 2018 చట్టం ద్వారా 50% క్యాప్ విధించడం వల్ల బీసీలు నష్టపోయారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే న్యాయస్థానాల్లో ఈ బిల్లు నిలబడుతుందా లేదా అన్నదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కోర్టు తీర్పు ప్రకారం ఈ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడే రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు కాబట్టి వారంలో రిజర్వేషన్లు ఖరారు చేసి.. వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీల వారీగా రూపొందించారు. పోలింగ్ కేంద్రాలను సైతం గుర్తించి వాటి జాబితాను ప్రచురించారు. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వారీగా ఓటర్ల జాబితాలను పంచాయతీరాజ్‌శాఖ బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com