తెలంగాణలో కోవిడ్ పేషెంట్లకు ఆస్పత్రుల్లో దొరకని బెడ్స్..!

కనీవినీ ఎరుగని ఉపద్రవం వచ్చిపడింది. దేశంపై వైరస్ వార్ భీకరంగా కొనసాగుతోంది. తెలంగాణలో కోవిడ్ పేషెంట్లకు ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకని పరిస్థితి ఉంది. ఆక్సిజన్ పడకలు ఉన్నా.. ICUలో వెంటిలేటర్ దొరకడం అసాధ్యంగా మారింది. ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయితేనో, చనిపోతేనో తప్ప..ICU బెడ్ ఖాళీ అయ్యే పరిస్థితి లేదు అనేంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శ్వాస కష్టమైనప్పుడు ఆఖరు నిమిషంలో ఆస్పత్రులకు పరుగెత్తితే ప్రమాదం తప్పకపోవచ్చు. హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్‌లోని 1200 పడకలు దాదాపు ఫుల్ అయ్యాయి. జిల్లాల నుంచి కూడా కొన్ని సీరియస్ కేసులు హైదరాబాద్‌కే వస్తున్నాయి.
కొన్ని చోట్ల ఆస్పత్రుల ముందు అంబులెన్స్‌ల క్యూ కన్పిస్తోంది. బెడ్ దొరికే వరకూ అంబులెన్స్‌లోనే పేషెంట్స్‌కి చికిత్స కొనసాగించాల్సిన దుస్థితి వచ్చింది. ఓవైపు ఆక్సిజన్ కొరత లేకుండా చేస్తున్నామని వైద్యులు చెబుతుంటే.. మరోవైపు.. వెంటిలేటర్ బెడ్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో తీవ్రమైన కటకట ఏర్పడింది. సకాలంలో వైద్యం అందక అంబులెన్స్‌లోనే రోగులు ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి దాపురించింది. తెలంగాణలో రోజువారీ కేసులు 6 వేలకు చేరడంతో మరింత టెన్షన్ మొదలైంది. మన అప్రమత్తతే మనల్ని కాపాడుతుందని వైద్యులు విస్పష్టంగా హెచ్చరిస్తున్నారు. మాస్క్, శానిటైజర్, భౌతికదూరం మర్చిపోతే కోరి వైరస్ అంటించుకున్నట్టే..ఆ తర్వాత ఆ మహమ్మారికి బలైపోయినట్లే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com