TG: చిల్‌ అవుదామంటే బీరు దొరకట్లేదట!

TG: చిల్‌ అవుదామంటే బీరు దొరకట్లేదట!
తెలంగాణలో రోజుకు 20 లక్షలకు పైగా బీర్ల అమ్మకాలు... డిమాండ్‌కు తగ్గట్లు లభ్యం కాని బీర్లు

తెలంగాణలో రోజుకి 20 లక్షలకు పైగా బీర్లు అమ్ముడుపోతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నా డిమాండ్‌కు తగినట్లు లభ్యం కావట్లేదు. ఇప్పట్లో కొరత తీరే అవకాశం లేదనే అబ్కారీ శాఖ అంచనాలు మద్యం ప్రియులకు రీకూల్‌ బీరు కంటే చేదునిస్తున్నాయి. మండుతున్న ఎండల్లో చల్లటి బీర్లు తాగి చిల్లవుదామనే మద్యం ప్రియులకు నిరాశే మిగులుతోంది. తెలంగాణలో సాధారణంగానే లిక్కర్‌ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు అధికం. హైదరాబాద్‌ అంతర్జాతీయ డెస్టినేషన్ కావడంతో ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. దానికి తగ్గట్లుగా మద్యం విక్రయాలు జోరుగా ఉంటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36వేల 493 కోట్ల విలువైన బీర్లు, మద్యం బాటిళ్లు అమ్ముడుపోయాయి. వేసవిలో లిక్కర్‌ అమ్మకాల కంటే బీర్ల విక్రయాలు పెరగటం సర్వసాధారణం. ఎక్సైజ్‌ అధికారులు సైతం బ్రీవరీలకు మూడో షిఫ్ట్‌కు అనుమతిచ్చి ఉత్పత్తిని పెంచడం సహా కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. ఐతే, ఎన్నికల నియమావళి అడ్డురావడంతో బీరు ప్రియులకు కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి.

తెలంగాణలో బీర్లు సరఫరా చేసే బ్రీవరీలకు 45రోజులకోసారి బిల్లులు చెల్లించే విధానం అమలయ్యేది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి సక్రమంగా చెల్లింపులు లేకపోవడంతో దాదాపు 2వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. సంబంధించిన చెల్లింపులు చేయాలని బ్రీవరీల యజమానులు ఇప్పటికే కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు మూడో షిఫ్టు బీరు తయారీకి సంబంధించిన రెండు ఫైళ్లు సర్కార్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మూడో షిఫ్టు ఉత్పత్తికి EC అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతుండగా...కర్ణాటక, తమిళనాడు, గోవా రాష్ట్రాలలో ధరలు అధికంగా ఉండటంతో దిగుమతి చేసుకునే అవకాశం లేకుండా పోయింది.

తెలంగాణలో ఆరు బ్రీవరీలు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 2లక్షల బీర్లు ఉత్పత్తయ్యే అవకాశం ఉంది. వేసవికి ముందే అప్రమత్తమయ్యే అబ్కారీ శాఖ ఉత్పత్తి పెంపు, దిగుమతులతో బఫర్‌ స్టాక్‌ సిద్ధం చేసుకునేది. రాష్ట్రంలోని 17 మద్యం డిపోలల్లో 20లక్షల బీర్ల వరకు బఫర్‌ స్టాక్‌ ఉంచుకొని డిమాండ్‌ను బట్టి సరఫరా చేసేది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు గణాంకాలు చూస్తే బీర్ల విక్రయాల్లో రెండో వంతు మాత్రమే లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. ఏప్రిల్‌లో సగటున రోజుకు 20లక్షలకు పైగా బీర్లు అమ్మడు పోయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మే నెలలో బీర్ల అమ్మకాలు మరింత పెరిగినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో బీర్ల విక్రయాలు పెరుగుతాయనే అంచనా వేస్తున్న మద్యం దుకాణాదారులు బఫర్‌ స్టాక్‌ పెట్టుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. మద్యం డిపోలల్లో అడిగిన ఇండెంట్‌లో సగం సైతం ఇవ్వట్లేదని ఆందోళన వెలిబుచ్చుతున్నారు. డిమాండ్‌కు సరిపడా బీర్లు సరఫరా చేయగలిగితే ప్రభుత్వానికీ ఆదాయం పెరుగుతుందని అబ్కారీ అధికారులు వెల్లడిస్తున్నారు.

Tags

Next Story