TG EAGLE: ఈగల్ చూస్తోంది తస్మాత్ జాగ్రత్త

మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నా.. విక్రయిస్తున్నా.. చెడు వ్యసనాలకు బానిసైనా.. ‘ఈగల్’ ఇట్టే పట్టేస్తుంది. దాని కళ్లు అలాంటివి మరి. అంతేనా.. విద్యా సంస్థల్లో ప్రత్యేక క్లబ్‌లు ఏర్పాటు చేసి.. వాటి ద్వారా మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు కృషి చేస్తోంది. పలు శాఖల సమన్వయంతో ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అన్న నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మాదక ద్రవ్యాల నివారణకు ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఎక్కడైనా అవి విక్రయిస్తున్నట్లు తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబరు 1972కు తెలపాలి.
డేగ కన్నుతో సంచలనాలు
మత్తు వదలుతారా.. వదిలించమంటారా అన్న రేంజ్లో తెలంగాణ సర్కార్ డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది. టీజీ న్యాబ్ బృందాలు ఊపిరిసలపని దాడులతో డ్రగ్స్పెడ్లర్స్ను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఈ పరిస్థితుల్లో కంట్లో నలుసులా.. పంటి కింద రాయిలా.. ఈగల్ టీమ్ ఆపరేషన్‌లో బయటపడ్డ ఓ విషయం సంచలనం సృష్టిస్తోంది. పేరెంట్స్‌ను, ప్రభుత్వాన్ని, అధికారులను కలవరపెడుతోంది. ఇటీవల దాడుల్లో ఓ సంచలన డ్రగ్ నెట్‌వర్క్‌ను చేధించింది. హైదరాబాద్‌లోని కాలేజీలే అడ్డాగా విద్యార్థులే కస్టమర్లుగా డ్రగ్స్ దందా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో తేలడం నివ్వెరపోయేలా చేస్తోంది. డ్రగ్స్ పట్టుబడేది పబ్బులు, గబ్బుపట్టిన ప్రదేశాలని ఇన్నాళ్లూ భావించాం.. కానీ.. మెజార్టీ డ్రగ్స్ పట్టుబడుతోంది.. వాటికి బానిసలవుతోంది స్టూడెంట్సే అన్న విషయంలో ప్రకంపనలు రేపుతోంది. అది కూడా వాళ్లు చదువుతున్న కాలేజీల్లోకే డ్రగ్స్ విచ్చలవిడిగా వస్తున్నాయని ఈగల్ టీమ్ దాడుల్లో బయటపడడం షాకిస్తోంది. డ్రగ్స్‌కు సంబంధించిన ఆయా పరిణామాలు.. ప్రభుత్వ వర్గాలతోపాటు.. పేరెంట్స్‌లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.
పంజాబ్‌లా అవ్వకూడదు
యుద్ధం, సైనికులు అంటేనే.. పంజాబ్ గుర్తుకు వచ్చేదని.. అలాంటి పంజాబ్ ఇవాళ డ్రగ్స్ మహమ్మారి వలలో చిక్కుకుందని రేవంత్ గుర్తు చేశారు. డ్రగ్స్ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. యువతను సరైన మార్గంలో పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణపతకం రాకపోవటం గురించి ఆలోచించామని,,. యువతకు సాంకేతిక నైపుణ్యం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. EAGLE ఒక డెడికేటెడ్ వాట్సాప్ నంబర్ (897781972), టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (1972)ను ప్రవేశపెట్టింది, దీని ద్వారా ప్రజలు మాదక ద్రవ్యాల కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందించవచ్చు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించడానికి రాష్ట్ర, జిల్లా, మండల, మరియు గ్రామ స్థాయిలో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, గ్రామ సచివాలయాలలో 10 సభ్యులతో కూడిన ‘EAGLE కమిటీలు’ ఏర్పాటు చేస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

