ఈసారి కూడా భక్తుల్లేకుండానే భద్రాచల రాములోరి కల్యాణం

ఈసారి కూడా భక్తుల్లేకుండానే భద్రాచల రాములోరి కల్యాణం
తెలంగాణలోని ప్రసిద్ధ భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి.

తెలంగాణలోని ప్రసిద్ధ భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. కానీ.. కరోనా కారణంగా గత ఏడాది నిరాడంబరంగా నిర్వహించారు. కనీసం ఈసారైనా రాములోరి కల్యాణం కళ్లారా వీక్షించాలనుకుంటున్న భక్తులకు నిరాశే ఎదురుకానుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా నిరాడంబరంగా ఉత్సవాన్ని జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈనెల 21న సీతారాముల కల్యాణాన్ని ఎప్పటిలాగే టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించింది. 22న మహా పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

వేడుకలు నిరాడంబరంగా, ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది తరహాలోనే ఈసారి కూడా అర్చకులు, వేదపండితులు, అధికారులు, పోలీసులు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ప్రభుత్వ ప్రతినిధులు మినహా సాధారణ భక్తులకు అనుమతి ఉండే అవకాశం లేదు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధించిన ఈ ఆంక్షలకు భక్తులు కూడా సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులెవరూ భద్రాచలం రావద్దని, ఇప్పటికే కల్యాణ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు డబ్బు వాపస్‌ చేస్తామని పేర్కొంది.

నవమి వేడుకలకు ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది. ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొస్తారా? లేదా అనే దానిపై సస్పెన్స్‌ నెలకొంది. పట్టాభిషేకానికి గవర్నర్‌ హాజరయ్యే ఆనవాయితీ ఉంది. అటు.. ఈ ఏడాది 70 క్వింటాళ్ల తలంబ్రాలను భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కల్యాణోత్సవం తర్వాత పంపిణీ కార్యక్రమం చేపడతారు. 100 కిలోల ముత్యాలను ఇప్పటికే కొనుగోలు చేశారు. 2 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను తయారు చేశారు. లక్ష లడ్డూలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక.. ప్రధాన వేడుకలన్నీ నిత్య కల్యాణ మండపంలోనే జరగనున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story