82వ రోజుకి చేరిన భట్టి పీపుల్స్ మార్చ్

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 82వ రోజు అచ్చంపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. సిద్దాపూర్ శివారులోని మర్లపాడ్ తండాకు చేరుకున్న భట్టికి గిరిజనులు ఘనస్వాగతం పలికారు. తండా వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు భట్టి విక్రమార్క. నక్కల గండి రిజర్వాయర్ ప్రాజెక్టు కింద తమ భూములు కోల్పోతే వలస వచ్చి బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నక్కలగండి ప్రాజెక్టు కింద మునిగిపోయిన భూములకు ప్రభుత్వం నుంచి సరైన పరిహారం అందలేదని గిరిజనులు భట్టి దృష్టికి తీసుకెళ్లారు.
ధరణి పోర్టల్ వల్ల తరతరాలుగా వస్తున్న భూమి తమది కాకుండా పోయిందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములు గోవిందరెడ్డి అనే వ్యక్తి పేరిట చూపిస్తుండటంతో.. ఆయన వారసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని భట్టికి వివరించారు. ధరణి తీసుకొచ్చి తమ నోట్లో మన్నుకొట్టారు.. కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళం... కేసులు అంటే ఏంటో తెలియదు... తమ భూములు తమకు ఇప్పించండి అంటూ గిరిజనులు... భట్టి విక్రమార్క ఎదుట బోరున విలపించారు. న్యాయం జరిగేలా చూస్తానని గిరిజనులకు భట్టి హామీ ఇచ్చారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com