TG: నేటి నుంచే అమల్లోకి భూ భారతి

ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘భూ భారతి’ చట్టం అంబేద్కర్ జయంతి సందర్భంగా నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టానికి సంబంధించిన వెబ్ పోర్టల్‌ను ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతి బిల్లుకు గత డిసెంబరులో అసెంబ్లీ ఆమోదం తెలిపగా.. ఈ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నదానిపై విధివిధానాలను రూపొందించామన్నారు. చట్టంలోని నిబంధనలను భూభారతి పోర్టల్ ప్రారంభోత్సవం రోజున రేవంత్ వివరిస్తారని పేర్కొన్నారు. ఏజెన్సీ ఏరియాలో గిరిజన, గిరిజనేతర ప్రజలకు సంబంధించిన భూముల విషయాలపై పలు అంశాలపై రేవంత్ స్పష్టత ఇస్తారని వెల్లడించారు. 2020లో ధరణి చట్టాన్ని తెచ్చిందని, కానీ 2023 వరకు కూడా ఆ చట్టం అమలుకు విధివిధానాలను ఖరారు చేయలేకపోయిందని పొంగులేటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిన మూడు నెలల్లోనే నిబంధనలను రూపొందించిందని చెప్పారు.
తొలుత మూడు మండలాల్లో..
భూభారతి పోర్టల్‌ను తొలుత ఎంపిక చేసిన 3 మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోర్టల్‌పై అవగాహన కల్పించేందుకు మండలాల్లో సదస్సులు నిర్వహిస్తారు. అనంతరం సేవలను విస్తరించనున్నారు. భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉండేలా పోర్టల్ రూపొందించామని సీఎం తెలిపారు. కొత్త చట్టం అమలు, నియమ నిబంధనలపై ఈ రోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. సామాన్య రైతుకు కూడా భూ భారతి అర్థం అయ్యేలా ఉండాలని అధికారులను సీఎంఆదేశించారు .
రెవెన్యూ సదస్సులు…
"భూ భారతి పైలట్ ప్రాజెక్ట్‌గా తెలంగాణలో మూడు మండలాలను ఎంపిక చేసి... వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సదస్సుల ద్వారా భూ భారతి పోర్టల్ గురించి రైతులు, ప్రజలకు సమగ్రంగా వివరించాలన్నారు. వారి సందేహాలను నివృత్తి చేయాలని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలంలో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. భూ భారతి పోర్టల్ సరళమైన, సులభంగా అర్థమయ్యే భాషలోనే ఉండాలన్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనల ఆధారంగా దానిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com