Vikarabad: ఆకాశం నుంచి ఊడిపడ్డ వింత వస్తువు.. ఆశ్చర్యంలో జనం

Vikarabad: వికారాబాద్‌లో కనిపించిన ఆదిత్య 369పై క్లారిటీ వచ్చింది. స్పేస్ టూరిజం కోసం టాటా కంపెనీ వాళ్లు ఆకాశంలోకి పంపించిన ఓ ప్రయోగమని వివరణ ఇచ్చారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ జరిపిన ఎక్స్‌పెరిమెంట్‌గా తేల్చారు. ఏలియన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా భావించిన ఆ హీలియం బెలూనే.. వికారాబాద్ పొలాల్లో ల్యాండ్ అయింది.
ఇవాళ తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో స్పేస్ రీసెర్చ్ కోసం ఓ శకటాన్ని నింగిలోకి పంపించారు. ఉదయం ఆకాశంలో కనిపించిన ఈ హీలియం బెలూన్‌ను చూసి.. అందరూ గ్రహాంతరవాసుల వాహనం అనుకున్నారు. ఆ తరువాత అది హీలియం బెలూన్ అని క్లారిటీ ఇచ్చారు.
ఆ కాసేపటికే వికారాబాద్ పొలాల్లో.. హీలియం బెలూన్‌కు తగిలించిన శకటం లాంటి వస్తువు ఆకాశం నుంచి పడింది. అచ్చం ఆదిత్య 369 సినిమాలో టైమ్ మెషీన్‌లా కనిపించింది. టైమ్ మెషీన్‌లా కనిపించిన ఆ వస్తువును.. స్పేస్ టూరిజానికి ఉపయోగించేలా ప్రయోగం జరుపుతున్నారని, హలో స్పేస్ సంస్థ దీన్ని రూపొందించిందని చెబుతున్నారు.
మొత్తానికి ఇవాళ ఆదిత్య 369 సినిమాను గుర్తు చేసే సంఘటన జరిగింది. ఆకాశం నుంచి పడిన ఓ విచిత్రమైన వస్తువు.. అచ్చం బాలకృష్ణ సినిమాలోని టైమ్ మిషన్‌ను తలపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గాని.. తమ పంట పొలాల్లో పడిందని రైతులు చెప్పడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా పరిగెత్తుకుంటూ వచ్చారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగలిగుండ్లలోని ఈ వింత ఆకారాన్ని చూసి.. ఏలియన్స్ గాని దిగారా అన్న పుకార్లు లేచాయి. నిజంగా ఆకాశం నుంచి పడి ఉంటే.. ఆ వస్తువు బద్దలై చెల్లాచెదురుగా పడి ఉండాలి. కాని, ఆ శకటం మాత్రం ఆకాశం నుంచి కిందకి దిగినట్టుగా ఉంది. అందుకే ఏలియన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ అంటూ అందరూ ప్రచారం చేశారు.
పొలాల్లో కనిపించిన ఈ వింత శకటం.. ఆదిత్య 369 సినిమాలో మాదిరిగా గుండ్రంగా, భారీ ఆకారంలో ఉంది. ఉదయాన్నే పొలాల మధ్య ఈ వింత శకటాన్ని చూసిన జనం ఊళ్లో వాళ్లకి చెప్పారు. దీంతో ఈ వింత వస్తువును చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివెళ్లారు. ఈ వింత శకటంలో ఏలియన్స్ భూమి మీదకు వచ్చి ఉంటారు అని కూడా అనుకున్నారు. ఏమీ అర్థంకాక చివరకు అధికారులకు సమాచారం ఇచ్చారు.
అసలే హైదరాబాద్‌లో ఈ ఉదయం ఆకాశంలో ఓ వింత వస్తువు కనిపించింది. ఏలియన్స్ వచ్చారంటూ ఆ నోట ఈ నోట ప్రచారం జరగడంతో అందరూ బయటికొచ్చి ఆకాశం వంక చూశారు. ఆకాశంలో కనిపించిన వింత వస్తువును వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే.. అది కాస్తా వైరల్ అయింది.
ఎంతలా అంటే.. డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ సైతం దాన్ని వీడియో తీసి ట్విటర్‌లో పెట్టారు. సాధారణంగా అది విమానమే అయితే గనక రెక్కలతో ఉండాలి. కాని, ఇది మాత్రం ట్రయాంగిల్ షేప్‌లో ఉంది. అల్లంత దూరాన వింత ఆకృతి చూసి.. అది ఏలియన్స్ ఎయిర్‌క్రాఫ్టే అనుకున్నారు. దీంతో పొదుపొద్దున్నే లేచిన హైదరాబాద్ వాసులు ఆ వింత ఆకారాన్ని ఆసక్తిగా గమనించారు.
చాలామంది తమకు తెలిసిన వారికి ఫోన్ చేసి చెప్పారు. హైదరాబాద్‌పై గ్రహాంతరవాసులు నిఘా పెట్టారా? ఏలియన్స్ నేలపై దిగేందుకు ప్రయత్నించారా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఆకాశంలో కనిపించిన మిస్టీరియస్ అండ్ ట్రయాంగిల్ షేప్ వస్తువు గురించి ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ క్లారిటీ ఇచ్చారు.
అది ఒక రీసెర్చ్ బెలూన్ అని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన నేషనల్ బెలూన్ ఫెసిలిటీ అనే ఓ సంస్థ వాతవారణాన్ని అధ్యయనం కోసం ఇలాంటి బెలూన్లను పంపిస్తారని వివరించారు. అది ఒక హీలియం బెలూన్ అని.. కొన్ని వందల మీటర్ల ఎత్తుకు దాన్ని పంపిస్తారని తెలిపారు. ఆ బెలూనుకు దాదాపు వెయ్యి కిలోల బరువున్న పరిశోధన వస్తువులను అమర్చి శాస్త్రవేత్తలు గాల్లోకి వదిలినట్లు చెప్పారు.
ఆ హీలియం బెలూనే కాసేపయ్యాక.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మొగలిగుండ్లలో పడిందని చెబుతున్నారు. మొత్తానికి అన్ని అనుమానాలపై ఓ క్లారిటీ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయినా.. వెయ్యి కిలోల బరువున్న ఆ వస్తువు పొలాల్లో పడింది కాబట్టి సరిపోయింది గాని.. ఇళ్లపై పడి ఉంటే పరిస్థితి ఏంటని మాట్లాడుకుంటున్నారు. కావాలనే పంట పొలాల్లో దిగేలా చేశారా లేదా ప్రమాదవశాత్తు దిగిందా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com