CONGRESS: బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు

CONGRESS: బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు
X
కొనసాగుతున్న ఎమ్మెల్యేల వలసలు... మరో ఆరుగులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ గూటికి..

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. మరో ఆరుగురు గులాబీ పార్టీ శాసనసభ్యులు హస్తం తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారు. ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడం గమనార్హం. తాజాగా, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా హస్తం గూటికి చేరుతున్నారు. ప్రస్తుతం తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన.. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. మరోవైపు, 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ రాష్ట్ర మంత్రులు చెబుతుండటం గమనార్హం.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ శనివారం పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది. ఈ మధ్య ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఇన్‌చార్జి మంత్రితో సమావేశమైనట్లు ప్రకటించారు. కానీ అప్పటి నుంచి వీరంతా పార్టీ మారేందుకు మానసికంగా సిద్ధమయ్యే మంత్రిని కలిశారనే ప్రచారం జరుగుతున్నది. ఆ తర్వాత గ్రేటర్ పరిధిలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే సదరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.

అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం క్రమంగా తగ్గుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే మృతి చెందడం, ఉప ఎన్నికలో అక్కడ కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ సీటు చేజారింది. మరోవైపు ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ జాబితాలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. శుక్రవారం ప్రకాశ్ గౌడ్ చేరికతో ఆ సంఖ్య 8కు చేరనుంది. దీంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారోనని టెన్షన్ కారు పార్టీ పెద్దలకు పట్టుకున్నది.

Tags

Next Story