కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో పెద్దపులి కలకలం

కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో పెద్దపులి కలకలం రేపుతోంది.. దాహెగాం మండలంలోని దిగాడ అటవీ ప్రాంతంలో పశువుల మేతకు వెళ్లిన యువకుడిపై పెద్దపులి దాడి చేసి చంపేసిన ఘటనతో ఆ ప్రాంత ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా యువకుడిపై దాడిచేసిన పెద్దపులి.. నోటకరుచుకుని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. వెనుక భాగం మొత్తం తినేసింది. యువకుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.. మృతిచెందిన యువకుడు విజ్ఞేశ్వర్‌గా గుర్తించారు. విజ్ఞేశ్వర్ మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
పెద్దపులి దాడితో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణం పులివచ్చి మీదపడుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.. పొలం పనులకు వెళ్లాలంటే రైతులు భయపడిపోతున్నారు.. మరోవైపు పులి జాడ తెలుసుకునేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.. బోన్లు ఏర్పాటు చేసి పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలో పులుల సంచారం పెరిగిపోయింది. గతనెలలో ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధిలోని కన్నాయిగూడెం అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత దాని జాడ ఎక్కడా కనిపించలేదు.. పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.. తాజాగా ఈ నెల 6న ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. అయితే, ఒకటే పులి ఈ ప్రాంతమంతా సంచరిస్తోందా.. లేక మరో పులి కూడా ఉందా అనేది అనుమానంగా ఉంది. తాజా ఘటనతో ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అడవిలోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించి పులి అడుగులను గుర్తించే పనిలో పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

