దేత్తడి హారిక సంచలన ప్రకటన.. తెలంగాణ టూరిజం శాఖలో ఏం జరుగుతోంది?

దేత్తడి హారిక సంచలన ప్రకటన.. తెలంగాణ టూరిజం శాఖలో ఏం జరుగుతోంది?
దేత్తడి హారికను ఏకంగా తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంతో రచ్చ వీధికెక్కిందా?

తెలంగాణ టూరిజం శాఖలో ఏం జరుగుతోంది? మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్‌ ఉప్పల్‌ శ్రీనివాస్‌ గుప్తా మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందా? ఛైర్మనే అంతా తానై నడిపిస్తున్నారా? దేత్తడి హారికను ఏకంగా తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడంతో రచ్చ వీధికెక్కిందా? తెలంగాణ పర్యాటక శాఖలో ఈ విషయం మీదే చర్చ నడుస్తోంది.

తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికను నియమించారు. మహిళా దినోత్సవం సందర్భంగా టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ ఉప్పల్‌ శ్రీనివాస్‌ గుప్తా.. TSTDC బ్రాండ్ అంబాసిడర్‌గా హారికకు నియామక పత్రాన్ని అందించారు. కానీ ఆ మరుసటి రోజే తెలంగాణ పర్యాటక శాఖ ఆమె వివరాలను వెబ్‌సైట్ నుంచి తొలగించింది. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించడం అనేది చాలా పెద్ద విషయం. సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా స్వయంగా సీఎం కేసీఆర్ నియమించారంటే.. ఈ నియామకాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. గుజరాత్, రాజస్తాన్‌కు అమితాబ్‌ బచ్చన్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించారు. అంతటి ప్రాధాన్యం ఉన్న పోస్టును అటు ముఖ్యమంత్రికి గాని, ముఖ్యమంత్రి కార్యాలయానికి గాని కనీస సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం, నియామకం జరిగిపోయాయి.

దేత్తడి హారికను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించిన సంగతి అసలు.. ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కూడా సమాచారం లేదు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే స్వతంత్ర నిర్ణయం తీసుకున్నారు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా. మంత్రికి, సీఎంవోకు సమాచారం ఇవ్వకపోవడాన్ని తెలంగాణ సర్కార్ తీవ్రంగా పరిగణించింది.

కరోనా కారణంగా తక్కువ బడ్జెట్‌లో టూరిజం ప్రమోషన్ చేయడానికే హారికను నియమించినట్టు టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ వివరణ ఇచ్చారు. కేవలం ఎపిసోడ్‌ వారీగా, ప్రోగ్రామ్‌ వారీగా మాత్రమే హారికకు చెల్లింపులు ఉంటాయని చెప్పుకొచ్చారు. పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నందున తక్కువ ఖర్చుతో ప్రమోట్ చేయాలనుకున్నట్టు చెప్పారు.

దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించగానే.. అసలు ఏ ప్రాతిపదికన ఆమెను నియమించారని సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడేసుకున్నారు. యూట్యూబ్ స్టార్‌గా ఉండడం, బిగ్ బాస్‌లో పాల్గొనడమే ఆమె అర్హతలా అని ప్రశ్నించారు. దీంతో తనకు తానే ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు దేత్తడి హారిక ప్రకటించింది.

మొత్తానికి తెలంగాణ పర్యాటక శాఖలో ఆధిపత్య పోరు నడుస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. శ్రీనివాస్‌ గౌడ్‌, శ్రీనివాస్‌ గుప్తా మధ్య ఎప్పటి నుంచో ఉన్న మనస్పర్ధలు.. ఈ ఘటనతో తారాస్థాయికి చేరాయని చెప్పుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story