Telangana BJP: త్వరలో బీజేపీ బస్సు యాత్ర

Telangana BJP: త్వరలో బీజేపీ బస్సు యాత్ర

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ బీజేపీ నేతలు బస్సు యాత్రలు చేపట్టనున్నారు. అగ్రనేత అమిత్ షా ఆదేశంతో జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలను కొన్ని రోజులు పక్కనపెట్టి.. కేసీఆర్‌ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర బీజేపీ అగ్ర నేతల ఆధ్వర్యంలో బస్సు యాత్రలకు అంతా రెడీ చేస్తున్నారు.. అయితే ఇదంతా ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడంలో భాగమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ బీజేపీ అగ్ర నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల నేతృత్వంలో త్వరలో బస్సు యాత్రలు మొదలు కానున్నాయి. ఇందుకోసం ఇప్పటికే మూడు రూట్లను రాష్ట్ర నాయకత్వం ఫైనల్‌ కూడా చేసింది.. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలు కదుపుతూ కుమ్రంభీం రూట్... రంగారెడ్డి, మహబూబ్‌గర్, నల్లగొండ జిల్లాలను కలుపుతూ కృష్ణా రూట్.. ఇక వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ గోదావరి రూట్‌ను సిద్ధం చేశారు. బీజేపీ బస్సు యాత్రను పర్యవేక్షించేందుకు 12మందితో రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేశారు. జిల్లాల వారీగా యాత్రను సమన్వయం చేసుకునేందుకు ఆయా జిల్లాల్లో ప్రత్యేక కమిటీలు సిద్ధం చేస్తున్నారు.

సెప్టెంబర్‌ రెండో వారంలో చేపట్టనున్న బీజేపీ బస్సు యాత్రను అక్టోబర్ 2న ముగించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ యాత్రలో రాష్ట్ర, జాతీయ నేతలు పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు. బస్సు యాత్రను దాదాపు 17రోజుల పాటు చేపట్టాలని భావిస్తున్నారు. బస్సు యాత్రకు పేరు పెట్టడంతో పాటు విజయవంతానికి చేపట్టాల్సిన విషయాలపై చర్చించేందుకు ఒకటి, రెండు రోజుల్లో బీజేపీ నేతలు సమావేశం కానున్నారు. బస్సు యాత్రతో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయాలని బీజేపీ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story