Telangana BJP: ఎన్నికలే లక్ష్యంగా.. వందరోజుల కార్యాచరణ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా వంద రోజుల ప్రత్యేక కార్యాచరణకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ శ్రేణులన్నీ అంకితభావంతో భాగస్వామ్యం కావాలని నిర్ణయించాయి. ఇటీవల జరిగిన పదాధికారుల సమావేశంలోనే వంద రోజుల కార్యాచరణపై చర్చించారు. రాష్ట్రంలోని 31 ఎస్పీ,ఎస్టీ రిజర్వుడు అసెంబీ స్థానాలపై ప్రత్యేక దృష్టిసారించనున్నారు. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఈనెల 16న టిఫిన్ సమావేశాలను ఆర్భాటంలేకుండా నిర్వహిస్తారు. నెలకు ఒక కీలకమైన రాష్ట్ర స్థాయి అంశాన్ని తీసుకుని దానిపై ప్రజా ఉద్యమం చేపట్టనున్నారు. బీజేపీ అధికారంలో వస్తే ఏం చేస్తుందో ప్రజలకు బలంగా చెప్పాలని... అన్ని వేదికలను దీని కోసం ఉపయోగించుకోవాలని తీర్మానం చేశారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వెయ్యి మంది ముఖ్యులతో నాయకుల భేటీ కార్యక్రమాన్ని పది రోజుల్లో పూర్తి చేయాలని, ఎవరు ఎవర్ని కలిశారు అనే అంశం సమాచారాన్ని పార్టీ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుందని నేతలు పేర్కొన్నారు.
అటు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల 29న ఖమ్మంలో పర్యటించనున్నారని సమాచారం వస్తోంది. అదే రోజు ఖమ్మంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. అమిత్ షా ఖమ్మం పర్యటనపై ఒకట్రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నిజానికి జూన్ 15నే అమిత్ షా ఖమ్మంలో పర్యటించాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో చివరి నిమిషంలో ఆ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ ఈటల రాజేందర్ ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఖమ్మం సభకు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు వంద మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు వస్తారని.. నియోజకవర్గంలో పర్యటిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే వరంగల్‌లో ప్రధాని మోదీ సభ.. ఆ తర్వాత హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ముఖ్యనేతల సమావేశం.. ఇప్పుడు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ.. ఇలా వరుస కార్యక్రమాలతో బీజేపీ యాక్టివ్ అయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com