BJP: తెలంగాణలో బీజేపీ రథయాత్ర

పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసంచేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ రథయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 5వ నుంచి 14 వరకు రథయాత్రలు చేపట్టనుంది. 17పార్లమెంట్ నియోజకవర్గాలని ఐదు క్లస్టర్లుగా విభజించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. ఐదుపార్లమెంట్ క్లస్టర్లలో ఐదు రథయాత్రలు నిర్వహించనుంది. ఒక్కో యాత్ర 20 నియోజకవర్గాలని చుట్టేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేశారు. ఒక్కో యాత్ర రోజుకు రెండునియోజకవర్గాలను చుట్టేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఆ యాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు, మోదీ సాహాసోపేతమైన నిర్ణయాలు తెలంగాణకు కేంద్రం కేటాయించిన నిధులను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడం సహా పదేళ్లలో బీఆర్‌ఎస్ అవినీతి, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో చేసిన మోసాన్ని ఎండగట్టనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐదు రథయాత్రలకు.. పార్టీ ముఖ్య నేతలు సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది.
కిషన్‌రెడ్డి కొత్త జట్టు
పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం... అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. ఈ మేరకు 10 MP సీట్లు, 35శాతం ఓటు బ్యాంకు లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ..... శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారితో పాటు పనితీరు బాగాలేని జిల్లాల అధ్యక్షులను మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 35 జిల్లాలకు కొత్త అధ్యక్షులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న చాలా మంది జిల్లా అధ్యక్షులకు మరోసారి అవకాశం కల్పించారు. మూడు జిల్లాలు అదిలాబాద్, మహబూబ్ బాద్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులపై ఇంకా స్పష్టత రాలేదు. రెండు మూడ్రోజుల్లో ఈ మూడు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కిషన్‌రెడ్డికి ఆహ్వానం
సెర్బియా పర్యటనకి రావాల్సిందిగా కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 22 నుంచి 25వరకు బెల్‌గ్రేడ్‌లో జరిగే 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్‌కు హాజరుకావాలని సెర్బియా పర్యాటకశాఖ మంత్రి హుసేన్ మెమిక్ ఆహ్వాన పత్రం పంపారు. యూరప్, సెర్బియాలో పర్యాటక రంగం అభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్కాఇది. గత 30ఏళ్లుగా ఈకార్యక్రమం జరుగుతుండగా ఈసారి అడ్వెంచర్ బిగిన్స్ హియర్ అనే థీమ్‌తో EITF జరగనుంది. వివిధ దేశాల నుంచి పర్యాటకశాఖ మంత్రులు, ఆ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, ఇన్వెస్టర్లు పెద్దసంఖ్యలో పాల్గొననున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com