BJP Meeting: విజయవంతంగా ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. కీలక సూచనలతో..

BJP Meeting: హైదరాబాద్ HICC వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణే లక్ష్యంగా ఆపరేషన్ దక్షిణ్‌కు పిలుపునిచ్చింది కమలం పార్టీ. పక్కా ప్లానింగ్‌తో పలు కీలక తీర్మానాలను ఆమోదించుకుంది. రాజకీయ తీర్మానంపై చర్చల్లో పాల్గొన్న ప్రధాని మోదీ చాలా అంశాలకు మార్పులు, చేర్పులు సూచించారు. దేశానికి బీజేపీ అవసరం ఉందన్న ఆయన.. సుదీర్ఘ కాలం పాలించిన పార్టీలు నిష్క్రమణ దారిలో ఉన్నాయన్నారు. బెంగాల్, కేరళలో బీజేపీ శ్రేణులపై దాడులు జరిగాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని.
కేరళ, తెలంగాణలో తమ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దక్షిణాదిలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూసుకెళ్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. కార్యవర్గ సమావేశంలో మోదీ ప్రసంగం గురించి ప్రెస్‌మీట్లో వివరించారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. వారసత్వ పార్టీలతో దేశ ప్రజలు విసిగిపోయారని.. దేశ వ్యాప్తంగా భాజపా విస్తరిస్తోందన్నారు.
అటు రాజకీయ తీర్మానంపై సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టగా కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై, అసోం సీఎం హేమంత బిశ్వశర్మ బలపరిచారు. ఏపీ, కేరళలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్, తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు ముగింపు రాబోతుందన్నారు. ఇదే విషయాన్ని అసోం సీఎం హేమంత బిశ్వశర్మ ప్రస్తావించారు. దేశంలో ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు మూలన కూర్చోబెట్టారన్న ఆయన.. వచ్చే 30ఏళ్లు బీజేపీదే అధికారమన్నారు.
దక్షిణాదిలో బీజేపీ పుంజుకునేందుకు కీలక సూచనలు చేశారు కర్ణాటకసీఎం బసవరాజు బొమ్మై. మైనారిటీ ఓట్లు బలంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనే అధికారం సాధ్యమైనపుడు.. దక్షిణాదిలో అదిపెద్ద కష్టమేం కాదన్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు తెలంగాణలో ఎందుకు చేయలేమన్నారు. బలహీన వర్గాల ఓటు బ్యాంకును పెంచుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని దక్షిణాది రాష్ట్రాల నేతలకు లక్ష్యాన్ని నిర్దేశించింది బీజేపీ కార్యవర్గం.
కార్యవర్గ సమావేశాల్లో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు అమిత్‌షా. అగ్నిపథ్‌ను విమర్శించడం బాధాకరమన్న ఆయన.. ప్రతి అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీపై ఉన్న అనేక ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టేసిందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ భ్రమల్లోనే రాజకీయాలు చేస్తుందని ఎద్దేవా చేశారు.
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్యంగా వెళ్లడం కలకలం రేపింది. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాస్ లోపలికి వెళ్లి మీటింగ్ అజెండా, తీర్మానం కాపీలు ఫోటోలు తీసేందుకు యత్నించగా అడ్డుకుని బయటకు పంపించేశారు. ఇక ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com