Rajgopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

Rajgopal Reddy: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా
ప్రజలు కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారన్న రాజగోపాల్‌రెడ్డి... రేపు హస్తం పార్టీలో చేరిక

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీ నేత, మునుగోడు మాజీ MLA కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించిన రాజగోపాల్‌ కుటుంబ పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయటమే లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్‌ను చూస్తున్నారని . వారి ఆలోచనలకనుగుణంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అభ్యర్థుల ఖరారు, నేతల అసమ్మతి, రాజీనామాలు, ఇతర పార్టీల్లో చేరికలతో రాజకీయ హడావిడి నెలకొన్న తరుణంలో బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గతేడాది ఆగస్టులో కాంగ్రెస్‌ను వీడి, కాషాయ కండువా కప్పుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.... మళ్లీ సొంతగూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2018అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్‌ గత ఏడాది ఆగస్టు మాసంలో కాంగ్రెస్‌ను వీడి, MLA పదవికి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరిన రాజగోపాల్‌ ఆ పార్టీ నుంచి ఉపఎన్నికల్లో పోటీ చేసి అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు.


ఉపఎన్నికలో ఓడిపోయిన రాజగోపాల్‌రెడ్డికి బీజేపీలో ఆశించిన ప్రాధాన్యత దక్కలేదని అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో పరిస్థితులపై ఆయన బహిరంగంగానూ వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చారు. అప్పుడే ఆయన కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం జరగటంతో బీజేపీ అధిష్ఠానం నచ్చజెప్పి, పార్టీలో పదవులు కట్టబెట్టింది. అయినప్పటికీ అసంతృప్తితోనే ఉన్న రాజగోపాల్‌... కొన్ని రోజులుగా మునుగోడుకు చెందిన తన అనుచరులతో చర్చిస్తూ వస్తున్నారు. కర్ణాటక ఎన్నికల అనంతరం, తెలంగాణలో మారిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పుంజుకోవటం, గతంలో ఊపుమీదున్న బీజేపీలోనూ అంతర్గతంగా మారిన పరిణామాలతో ఇన్నాళ్లు సందిగ్ధంలో ఉన్న రాజగోపాల్‌.... అభ్యర్థుల ప్రకటన వేళ సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నారు..

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తీవ్ర కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులు, గతంలో పార్టీని వీడిన వారితో అంతర్గతంగా చర్చలు జరుపుతూ వస్తోంది. ఈ క్రమంలోనే రాజగోపాల్‌తో పార్టీ నేతలు పలుదఫాలుగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ తొలిజాబితాలోనే మునుగోడు స్థానానికి అభ్యర్థిని ఖరారు చేయలేదని పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. తెలంగాణ ప్రజలు అధికార మార్పును కోరుకుంటున్నారని.... వారి ఆలోచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story