Telangana BJP : తెలంగాణలో పాగా వేయడానికి పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్

Telangana BJP : తెలంగాణలో పాగా వేయడానికి పావులు కదుపుతున్న బీజేపీ హైకమాండ్
Telangana BJP : ఢిల్లీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా అన్ని రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పటిష్టం చేసుకునే పనిలో బీజీగా ఉంది

Telangana BJP : ఢిల్లీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, సంస్థాగతంగా అన్ని రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పటిష్టం చేసుకునే పనిలో బీజీగా ఉంది. ఇదే సమయంలో దేశాన్ని ఏకం చేసే దిశగా, కాంగ్రెస్‌ను పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ.. భారత్‌ జోడో యాత్ర చేపడుతున్నారు. ఇక ఎన్డీయేను విస్తరించే పనిలో పడిన.. అధికారపక్షం బీజేపీ.. కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో వేగంగా అడుగులు వేస్తోంది. మోదీ-షా ద్వయం మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. ఆపరేషన్‌ దక్షిణ్‌ను తెలుగు రాష్ట్రాల నుంచే ప్రారంభించేందుకు కమలదళం సిద్ధమవుతోంది.

ఉత్తరాదిన సీట్లు తగ్గితే.. వాటిని దక్షిణాది నుంచి భర్తీ చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్న బీజేపీ హైకమాండ్.. టీడీపీని మళ్లీ ఎన్డీయేలో చేర్చుకోవచ్చని తెలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి ఓటర్లు, సానుభూతిపరులతో పాటు క్యాడర్‌ కూడా బలంగా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే టీడీపీ మద్దతు తీసుకుంటే మంచిదని జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజకీయ పోరాటాలు చేస్తూనే.. సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు విమర్శలు చేయడం, తెలంగాణలో వరుస పర్యటనలు చేయడం వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు.

తెలంగాణాలో టీడీపీతో కలిసి వెళ్లడం వల్ల తెలంగాణాలో ఇప్పుడున్న 4 ఎంపీ స్థానాలకు తోడు మరో మూడు నాలుగు స్థానాలు తమ ఖాతాలో జమ అవుతాయని లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీతో లాభం ఉంటుందని కాషాయ నేతలు భావిస్తున్నారు. తమకు ఉన్న సానుకూల అంశాలకు తెలుగుదేశం పార్టీ తోడైతే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సుదీర్ఘ అనుభవంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఉన్న టీడీపీ క్యాడర్‌... తమకు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోంది.

ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడినా, దక్షిణ తెలంగాణలో బలహీనంగా ఉంది. టీడీపీతో జతకట్టి ఈ లోటును పూడ్చాలని చూస్తోంది మోదీ-షా ద్వయం. మరోవైపు తెలంగాణాలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు బీసీ కార్డును ఉపయోగించే ఆలోచనలోనూ బీజేపీ అగ్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలూ అగ్రకులాల నాయకత్వంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వస్తే బలమైన బీసీ నేతకు పగ్గాలు ఇస్తామనే సంకేతం ఇచ్చే దిశగా రాబోయే రోజుల్లో బీజేపీ కార్యాచరణ ఉండబోతోందని తెలుస్తోంది.

ఇక.. ఎప్పటి నుంచో దక్షిణాదిలో బలపడాలని చూస్తున్న కమలదళం.. అందుకు అనుగుణంగా ఏపీపైనా ఫోకస్ పెట్టారు. ఆపరేషన్‌ దక్షిణ్‌.. బహుముఖ వ్యూహంలో భాగంగా టీడీపీని దగ్గర చేర్చుకునే దిశగా బీజేపీ కీలకనేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కమలం అగ్రనేతలు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో టచ్‌లో ఉన్నారని బీజేపీ విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు ఏపీలో మొత్తం 8 లోక్‌సభ స్థానాలపై గురి పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అగ్రనేతల ఆదేశాల మేరకు ఇప్పటికే ఆ 8 స్థానాల్లో పని ప్రారంభమైందని పార్టీ నేతలు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత ఉందని.. ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని బీజేపీ చెబుతోంది. దీన్ని సమర్థంగా వాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీని లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ-బీజేపీ కలిసి వెళ్లడం ఖాయమని, రాబోయే రోజుల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని మోదీ, అమిత్‌షాతో సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలు చెబుతున్నారు.

గత అనుభవాల దృష్ట్యా ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు టీడీపీతో నేరుగా పొత్తు అనేది లేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామంటున్నారు కమలనాథులు. అయితే తెలంగాణ, ఏపీలోనూ కొందరు పార్టీ నేతలు టీడీపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు నో అంటున్నట్లు తెలుస్తోంది. సుముఖంగా లేని నేతలను లెక్కల్లోకి తీసుకోవడం లేదని, కలిసి వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. అంతిమంగా పార్టీ బహుళ ప్రయోజనాల దిశగానే ఢిల్లీ పెద్దలు.. ఆపరేషన్ దక్షిణ్ వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story