Munugodu: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓ అడుగు ముందే ఉన్న బీజేపీ..

Munugodu: మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తోంది. ఈ ఉపఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ,కాంగ్రెస్, టీఆర్‌ఎస్ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుంది. ఈ ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్ పూర్తిగా ఫోకస్ చేసింది. లక్ష ఓట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న కమలదళం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలుకోవడం లేదు. రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంతో పార్టీ బలం చేకూరుతుందని భావిస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. పాత కొత్త నేతల సమన్వయంతో పనిచేస్తే లక్ష ఓట్లు కష్టం కాదంటంటోంది.
ఈనెల 21న మునుగోడులో అమిత్ షా సభ జరగనుంది. అదే రోజు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అమిత్‌షా సమక్షంలో.. బీజేపీలో చేరనున్నారు. రాజ్‌గోపాల్‌రెడ్డి చేరిక తర్వాత ఉపఎన్నికల ప్రచారం పర్వంలో దూసుకుపోవాలని నిర్ణయించింది బీజేపీ. ఇప్పటికే అమిత్‌షా సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. కేంద్ర హోంమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమిత్ షా సభ తర్వాత స్థానిక బీజేపీ నేతలు ఏం చేయాలనే విషయంలోనూ ఇప్పటికే క్లియర్‌గా ఆదేశాలు జారీ చేసింది హైకమాండ్. ఈ నెల 21న అమిత్‌షా సభ తర్వాత నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది.
ఈ నెల 22 నుంచి మునుగోడులో బీజేపీ నేతలు మకాం వేస్తున్నారు. బహిరంగ సభ తర్వాత ఉప ఎన్నిక కోసం ఎన్నికల కమిటీ వేయనుంది. ఇక ప్రచారానికి ఏకంగా కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు సైతం వస్తున్నారు. బీజేపీ హైకమాండ్‌తోపాటు పాటు కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ జీవితానికి మునుగోడు ఉపఎన్నిక సవాల్‌గా మారింది. దీంతో ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది బీజేపీ. ఈటల రాజేందర్, జితేందర్‌రెడ్డి కీలక బాధ్యతలు తీసుకుంటున్నారు. రాజేందర్ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెలలోనే తన కార్యకలాపాలు నిర్వహించనున్నారు.
ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి త్వరలో మునుగోడులో మకాం వేస్తారు. వీరితో మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ జోరుగా సాగుతోంది. చౌటుప్పల్ లోని టీఆర్‌ఎస్ చెందిన ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరారు.
ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షులు పెద్దిటి బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డీ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కందిలక్ష్మారెడ్డీలను ఈటల రాజేందర్ బీజేపీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసగించిన ఈటల రాజేందర్ కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీనే అని ఈటల అన్నారు. మొత్తానికి.. మునుగోడులో గెలుపే లక్ష్యంగా.. బీజేపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోంది. మునుగోడు సీటు తమదేనని ఘంటాపథంగా చెబుతున్నారు బీజేపీ అగ్రనేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com