హైదరాబాద్‌లో కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ నేతలు

హైదరాబాద్‌లో కలెక్టరేట్‌ను ముట్టడించిన బీజేపీ నేతలు


డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లపై బీజేపీ పోరుబాట పట్టింది. అర్హులైన పేదలందరికీ వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. పలు జిల్లాల్లో కలెక్టరేట్లు, మంత్రుల క్యాంపు కార్యాలయాల దగ్గర ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లో కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు బీజేపీ నేతలు. లోనికి వెళ్లేందుకు యత్నించిన పలువురు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. లక్ష్మణ్‌తో పాటు.. బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు. పేదలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తోందని ఆరోపించారు.

అటు సూర్యాపేటలోనూ మంత్రి జగదీష్‌రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ నేతలు ముట్టడించారు. పేదలందరికీ డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వరంగల్‌లో బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు ముళ్లకంచెలతో ఆందోళనకారులను నిలువరించారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. లాఠీచార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

Tags

Next Story