TG: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి

TG: బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడి
X
దాడిని ఖండించిన టీపీసీసీ... కాంగ్రెస్ పై బీజేపీ నేతల ఆగ్రహం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత రమేష్ బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం... తెలంగాణలో తీవ్ర అలజడి రేపింది. కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాను ఉద్దేశిస్తూ ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన.. తాను గెలిస్తే స్థానిక రోడ్లను ప్రియాంక గాంధీ వాద్రా బుగ్గల్లా మారుస్తానంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. నిరసనల్లో భాగంగా . హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్యాలయ ముట్టడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారింది. బీజేపీ- కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు నేతలకు గాయాలయ్యాయి. అక్కడికు చేరుకున్న పోలీసులు..పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.

బీజేపీ ఆఫీస్ పై దాడిని ఖండించిన టీపీసీసీ

హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీస్ పై యూత్ కాంగ్రెస్ నేతలు దాడి చేయడాన్ని టీపీసీసీ ఖండించింది. నిరసనలు ప్రజాస్వామ్య పద్ధతిలో చేయాలి, ఆఫీసులపై దాడి చేయడం సరికాదని తెలిపింది. బీజేపీనేతల వ్యాఖ్యలను ఖండిచాల్సిందే కానీ, హింసాత్మక విధానంలో కాదని, రాజకీయ పార్టీల ఆఫీసుల జోలికి వెళ్లొద్దని యూత్ కాంగ్రెస్ కు వార్నింగ్ ఇచ్చింది. అలానే ప్రియాంక గాంధీపై బీజేపీ చేసిన వ్యాఖ్యలు కూడా సరైనవి కాదని తెలిపింది.

రాళ్లతో దాడి.. స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్

తెలంగాణ బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. కాంగ్రెస్ అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. బీజేపీ నేతలపై దాడి చేయడం ఖండిస్తున్నామన్నారు. చట్టపరంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నామని పురందేశ్వరి తెలిపారు.

Tags

Next Story