BJP: అరెస్టయిన బీజేపీ కార్యకర్తలకు బెయిల్ మంజూరు..

BJP: MLC కవిత ఇంటి ముందు ధర్నా కేసులో అరెస్టయిన బీజేపీ నేతలకు బెయిల్ మంజూరయింది. సొంత పూచికత్తుపై కార్యకర్తలకు బెయిల్ మంజూరు చేశారు మేజిస్ట్రేట్. కవిత ఇంటి ముట్టడి కేసులో 29 మందిపై బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. 26 మందిని అరెస్టు చేశారు మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ కేసులో మొత్తం మూడు సార్లు సెక్షన్లు మార్చారు పోలీసులు. నిన్న సాయంత్రం 341, 148, 353, 509, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాత్రి వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలిస్తుండగా.. 307 సెక్షన్ కూడా యాడ్ చేశారు.
ఐతే ఉదయానికి మళ్లీ 307 సెక్షన్ తొలగించారు పోలీసులు. వీరిని వర్చువల్‌గా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సొంత పూచికత్తుపై బీజేపీ నేతలకు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజీనామా చేయాలంటూ సోమవారం MLC కవిత ఇంటిను ముట్టడించేందుకు యత్నించారు బీజేపీ నేతలు. దీంతో బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు..వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌లకు తరలించారు.
29 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఐతే బీజేపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీజేపీ. ఇవాళ సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య అన్ని మండలాల్లోని పార్టీ ఆఫీసుల దగ్గర నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని సూచించింది. ఇక కార్యకర్తలపై కేసుల అంశంపై బీజేపీ అధిష్టానం కూడా ఆరా తీసినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com