Telangana : తెలంగాణలో జోరు పెంచిన బిజేపి

Telangana : తెలంగాణలో జోరు పెంచిన బిజేపి
ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రులు

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలో గెలిచినంత మాత్రాన తెలంగాణలోనూ విజయం సాధించినట్లు ముందే ప్రగ‌ల్భాలు పలుకుతోందంటూ విమర్శించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో.. పలువురు నేతలు పెద్ద సంఖ్యలో కిషన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మరోవైపు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కేంద్రమంత్రులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ శ్రేణుల్లో ఉత్తేజం నింపుతున్నారు.


తెలంగాణలో అధికారమే లక్ష్యంగా భాజపా పావులు కదుపుతోంది. జాతీయ స్థాయి నేతల నుంచి రాష్ట్ర నేతలు పార్టీని బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వీరశైవ లింగాయత్ రాష్ట్రఅధ్యక్షుడు వన్నె ఈశ్వరప్ప, మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్జ నగాంకు చెందిన కల్నల్ భిక్షపతికి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే భారాసకు ఓటేసినట్లేనని భారాసకు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్లేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. మోదీ సభతో కేసీఆర్ బండారం బయటపడిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రగతి భవన్‌లో కొట్లాటలు జరుగుతున్నాయంటూ.. ఎద్దేవా చేశారు. అధికారం లేకుండా ఉండలేని ముఖ్యమంత్రి కేసీఆర్ .. ఎన్నికల్లో డబ్బు పంచి గెలిచేందుకు చూస్తున్నారని.. భాజపా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ మండిపడ్డారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బీఎల్‌ శర్మ పర్యటించారు. పట్టణంలో భాజపా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తన కుటుంబంతో కలిసి తెలంగాణను దోచుకుంటున్నారని భాజపా ఖమ్మం జిల్లా ఇన్‌చార్జీ , జాతీయ కార్యవర్గ సభ్యులు సునీల్‌ దియోధర్‌ ఆరోపించారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారాస - కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని.. అవినీతి, కుటుంబ పాలన ఆ పార్టీల విధాననమంటూ.. కేంద్ర సహాయ మంత్రి భగవత్ ఖుబా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లోని భాజపా కార్యాలయంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనేక పథకాల కోసం కోట్లాది రూపాయలు కేంద్రం పంపుతున్నా తెలంగాణ సర్కారు సహకరించట్లేదని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంధ్లాజే విమర్శించారు.


ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన రాష్ట్ర భాజపా... ప్రధాని మోదీ బహిరంగ సభలు సహా కీలక కేంద్రమంత్రుల సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తూ పక్కాగా ముందుకెళ్తోంది

Tags

Read MoreRead Less
Next Story