BJP : ఇప్పటికీ తేలని బీజేపీ శాసనసభాపక్షనేత

BJP : ఇప్పటికీ తేలని బీజేపీ శాసనసభాపక్షనేత
X
కొనసాగుతున్న ఉత్కంఠత

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేతను ఇంకా నియమించలేదు. LP నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పట్లో LP నేత నియామకం ఉండబోదనే ప్రచారం పార్టీ శ్రేణుల్లో జోరుగా నడుస్తోంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 8మంది భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ఈనెల 9న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా... కాషాయ నేతలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్‌గా మజ్లీస్‌ MLA అక్బదుద్దీన్‌ ఓవైసీ సమక్షంలో ప్రమాణం చేయబోమని ప్రకటించి గైర్హాజరయ్యారు. సీనియర్ MLAలను కాదని అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌ చేయటంపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఇవాళ సమావేశాలు ప్రారంభం కానుండటంతో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ సమక్షంలో ప్రమాణం చేయాలని భావిస్తున్నారు.

ఈసారి శాసనసభాపక్ష నేత లేకుండానే సమావేశాల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో భాజపా నుంచి కేవలం రాజాసింగ్ ఒక్కరే గెలుపొందగా తర్వాత ఉపఎన్నికల్లో రఘునందన్‌రావు, ఈటల విజయం సాధించారు. కాగా LP నేతగా రాజాసింగ్‌కు పార్టీ అవకాశం ఇచ్చింది. ఇటీవలి ఎన్నికల్లో భాజపా 8స్థానాల్లో గెలుపొందటంతో. LPనేత రేసులో రాజాసింగ్‌తో పాటు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఇప్పుడే LPనేతను నిర్ణయిస్తే నష్టపోయే ప్రమాదముందని హైకమాండ్‌ గ్రహించినట్లు సమాచారం. పార్లమెంట్‌ సమావేశాల తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

శాసనసభాపక్ష నేత నియామకంపై జాతీయ నాయకత్వం తాత్సారం చేయటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లో మొదటిసారి MLA అయిన నేతకు భాజపా ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టింది. దీని ప్రకారం చూస్తే మాజీ CM KCR, ప్రస్తుత CM రేవంత్‌రెడ్డిని ఓడించిన కామారెడ్డి MLAకి అవకాశం కల్పించనుందా? లేక రెండుసార్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి అవకాశం కల్పించనుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్‌కు తెలుగుపై పట్టు లేకపోవటం, హిందుత్వ ఎజెండా, గోషామహల్‌ వరకే పరిమితమవ్వటం ప్రతికూలతలుగా ఉన్నాయి. గతంలో వేరే అవకాశం లేకే రాజాసింగ్‌కు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శాసనసభాపక్ష నేతగా MLAల అందరి అభిప్రాయం తీసుకున్నాకే పార్టీ తుది నిర్ణయం వెలువరించే అవకాశం ఉన్నట్లు సమచారం. అందరితో కలుపుకుని వెళ్లే నేతకే అవకాశం ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుండగా...పార్టీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠను కలిగిస్తోంది.

Tags

Next Story