Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత

Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత
భారీగా మోహరించిన పోలీసులు

బీజేపీ నేత బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర సిద్దిపేట చేరుకోగా.. అక్కడ కాంగ్రెస్, బీజేపీశ్రేణులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్రపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ప్రజాహిత యాత్రను అడ్డుకుంటామంటూ కాంగ్రెస్ శ్రేణులు వచ్చారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. భారీగా మోహరించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాహిత యాత్ర క్యాంపు వైపు రాకుండా నిలువరించారు. బీజేపీ నేతలను సైతం ప్రజాహిత యాత్రకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. పలువురు నేతలను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం పటిష్టమైన భద్రత నడుమ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది.

ప్రజాహిత యాత్రపై దాడి చేయాలని చూస్తున్న కాంగ్రెస్ శ్రేణులపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాహిత యాత్రను అడ్డుకోవాలని చూస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మరోవైపు ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలియడంతో అప్రమత్తమైన బీజేపీ శ్రేణులు.. బండి సంజయ్‌కు మద్దతుగా యాత్ర వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఇదిలాఉంటే.. హుస్నాబాద్ నియోజకవర్గం బొమ్మెనపల్లి నుండి రెండోరోజు ప్రజాహిత యాత్రకు బండి సంజయ్ సిద్ధమయ్యారు. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

హుస్సాబాద్ లో సోమవారం నిర్వహించిన ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పొన్నం ప్రభాకర్ ను కించపర్చేవిలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నేతలు దగ్దం చేశారు. పొన్నం ప్రభాకర్ అనుచరులతోపాటు కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. బీజేపీ ప్లెక్సీలను చించివేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్, సిద్ధిపేట కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లకు తరలించారు. బండి సంజయ్ ఇవాళ పర్యటించే ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొడంతో పోలీసులు సంజయ్ యాత్రపై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సంజయ్ సభల్లో మాట్లాడొద్దని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు.

Tags

Read MoreRead Less
Next Story