ఢిల్లీకి వెళ్లి వచ్చాక కేసీఆర్‌కు భయం పట్టుకుంది : బండి సంజయ్

తెలంగాణలో ఎలాంటి ఎన్నికలు జరిగిన వాటిలో విజయం సాధించే దిశగా పక్కా ప్రణాళికలు రచిస్తోంది కమలం పార్టీ. త్వరలో కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్ మూడు రోజుల పాటు పర్యటిస్తారు. దానిలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ముందుగా ఇందల్వాయి చేరుకున్న తరున్ ఛుగ్.. అక్కడి నుంచి భారీ ర్యాలీని డిచ్‌పల్లి వరకు నిర్వహించారు.
తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్. టీఆర్ఎస్ బంగారు తెలంగాణను.. బీమారీ తెలంగాణ చేసిందన్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నవాళ్లపై భవిష్యత్‌లో చర్యలు ఉంటాయన్నారు. రాష్ట్రం ఒకే కుటుంబం చేతిలో చిక్కుకుందని విమర్శించారు తరుణ్ ఛుగ్.
అటు టీఆర్‌ఎస్ గడీలను బద్దలుకొడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. సీఎం పదవి కోసం కేసీఆర్ ఇంట్లో పంచాయతీ జరుగుతోందన్నారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్.. దండాలు పెట్టిన జైలుకెళ్లడం ఖాయమన్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు దిమ్మదిరిగిందని విమర్శించారు. టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.
ఇక గత ఏడేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో బోధన్ నియోజకవర్గం అత్యంత నిర్లక్ష్యానికి గురైందన్నారు ఎంపీ అరవింద్. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్.. ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గల్ఫ్ బాధితుల సంఖ్య రెట్టింపు అయ్యిందన్నారు. పసుపు బోర్డు కన్నా మంచి వ్యవస్థ తెచ్చామని.. దీనిపై రైతులను టీఆర్‌ఎస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అరవింద్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com