BJP Deeksha: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ 'నిరసన దీక్ష'.. ఉదయం 11 గంటల నుండి..

BJP Deeksha: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్ష.. ఉదయం 11 గంటల నుండి..
BJP Deeksha: అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలపై బీజేపీ ఇవాళ నిరసన దీక్షకు పిలుపునిచ్చింది.

BJP Deeksha: తెలంగాణలో జరుగుతున్న అక్రమ అరెస్టులు, అరాచక దాడులు, నిరంకుశ నిర్బంధాలపై బీజేపీ ఇవాళ నిరసన దీక్షకు పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ''నిరసన దీక్ష'' చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్‌లో జరిగే నిరసన దీక్షలో బీజేపీ శ్రేణులంతా పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గృహ నిర్బంధంలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లోని తన నివాసంలో ''నిరసన దీక్ష'' చేయనున్నారు.

లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను పక్కదారి పట్టించేందుకే తెలంగాణ ప్రభుత్వం కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపిస్తోంది. అందుకే దిగ్విజయంగా కొనసాగుతున్న ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకుని బండి సంజయ్‌ని అక్రమంగా నిర్బంధించారనే అంశాన్ని నిరసనదీక్ష సందర్భంగా మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తుండటం.. బహిరంగ సభలు సక్సెస్ కావడంతో ఓర్వలేకే బండిసంజయ్‌ పాదయాత్రను అడ్డుకున్నారని బీజేపీ మండిపడుతోంది.

కేసీఆర్ నిజాయితీపరుడైతే కవితను సస్పెండ్ చేయాలన్నారు బండి సంజయ్. అరెస్టుపై తీవ్రంగా స్పదించారు. 21 రోజులుగా యాత్రపైలేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ మండిపడ్డారు. యాత్రను ఆపడమే కేసీఆర్ పతనానికి నాంది అన్నారు బండి సంజయ్. మరోవైపు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు బ్రేకులు వేశారు. పాదయాత్రను వెంటనే విరమించుకోవాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట డివిజన్‌ ఏసీపీ పేరిట నోటీసులు జారీ అయ్యాయి. ప్రజా సంగ్రామ యాత్ర కన్వీనర్‌తోపాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు.

అనుమతి లేకుండా బండి సంజయ్‌ పాదయాత్ర చేయడమే కాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. ధర్మ దీక్షపేరుతో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారని.. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. బండి సంజయ్‌ యాత్రను అడ్డుకునేందుకు ప్రగతి భవన్‌ నుంచి కుట్ర నడిచిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. బీజేపీ బలపడటాన్ని కల్వకుంట్ల కుటుంబం ఓర్చుకోలేకపోతోందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ చేతకాదని ప్రభుత్వం పరోక్షంగా ఒప్పుకుందన్నారు కిషన్‌రెడ్డి.

బండి సంజయ్‌ అరెస్టు, ప్రజా సంగ్రామయాత్ర నిలిపివేతపై రాజ్ భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిశారు తెలంగాణ బీజేపీ నేతలు. ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిచ్చి తగిన భద్రత కల్పించేలా డీజీపీని ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. బీజేపీ కార్యకర్తలపై దాడితో పాటు ప్రజా సంగ్రామయాత్రపై జరిగిన కుట్రపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్‌ అరెస్టుతో పాటు బీజేపీ నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. బండి సంజయ్‌కి కేంద్ర పెద్దలు ఫోన్‌ చేసి రాష్ట్ర పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

అటు ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సోమవారం ఆమె ఇంటి దగ్గర నిరసనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీనికి నిరసనగా జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్ మండలం పామునూర్‌లో పాదయాత్ర శిబిరం దగ్గరే బండి సంజయ్‌ ధర్మ దీక్షకు దిగారు. పోలీసులు ఈ దీక్షను భగ్నం చేసిన ఆయన్ను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. బండి సంజయ్‌ అరెస్టు తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది.

Tags

Read MoreRead Less
Next Story