BJP: నేడే బీజేపీ బహిరంగ సభ

BJP: నేడే బీజేపీ బహిరంగ సభ
X
హాజరుకానున్న జేపీ నడ్డా... "6 అబద్ధాలు, 66 మోసాలు" నినాదంతో ప్రజల్లోకి

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై సరూర్‌నగర్‌ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానుండడంతో రాష్ట్ర పార్టీ నాయకత్వం ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్న ఈ సభకు భారీ జన సమీకరణ చేస్తోంది. ఈ సభను విజయంవంతం చేసి తెలంగాణలో తమ సత్తా చాటేందుకు కమలదళం సిద్ధమైంది.

"6 అబద్ధాలు, 66 మోసాలు" బీజేపీ కొత్త నినాదం

తెలంగాణ బీజేపీ కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తి కావడంతో ఇక క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తోంది. కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి, తెలంగాణ ఇంచార్జి సునీల్‌ బన్సల్‌ ఇప్పటికే వ్యూహాలకు పదును పెట్టారు. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటిన కమల దళం.. జమిలీ ఎన్నికలు వస్తే అప్పటికల్లా తెలంగాణలో బలపడాలని ప్రణాళిక రచిస్తోంది.

కాంగ్రెస్‌ అంటే కమిషన్లు, కమిటీలు: బండి సంజయ్‌

కాంగ్రెస్‌ అంటే కమిటీలు, కమిషన్లు, కాలయాపన.. అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మరోసారి తీవ్రంగా విమర్శించారు. ‘ధరణిపై కమిటీ, హైడ్రా, మూసీ, ఫోర్త్‌ సిటీలతో కమిషన్‌లు, రైతు భరోసాపై కాలయాపన.. అలాంటి కాంగ్రెస్‌ పాలనలో ఏడాది కాదు... ఒక్క యుగం గడచినా సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగు పడదు’ అని సంజయ్‌ ఎక్స్‌ వేదికగా ఆరోపించారు. సరూర్ నగర్ సభను విజయవంతం చేయాలని బండి పిలుపునిచ్చారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఆశించనన్నీ సీట్లు రాలేదు. కానీ. పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకున్న పార్టీ ఏకంగా 8 ఎంపీ సీట్లను గెలచుకుంది. అంతేకాదు రాష్ట్రంలో ఆ పార్టీకి 35 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత అంతేస్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ హైకమాండ్‌ ఆదేశించడంతో ... ఆ టార్గెట్‌ను కూడా కమలనాథులు పూర్తి చేశారు. దాంతో రాష్ట్రంలో వీలైనన్నీ పోలింగ్ బూత్‌లకు కొత్త కమిటీలు వేయాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 36 వేల పోలింగ్‌ బూత్‌ ఉండగా.. కనీసం 25 వేల బూత్‌లకు కొత్త కమిటీలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారని సమాచారం.

Tags

Next Story