KISHAN REDDY: నిజాయతీ పాలన బీజేపీతోనే సాధ్యం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై తెలంగాణ కమలం నేతలు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పటికే ఈ ఫలితాలపై స్పందించగా... తాజాగా మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా బీజేపీ ఘన విజయంపై హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే ఓ నమ్మకమని... నిజాయతీ పాలన బీజేపీ తోనే సాధ్యమని ఢిల్లీ ప్రజలు విశ్వసించారని కిషన్ రెడ్డి అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ జెండా ఎగురవేస్తున్నామని.. తెలంగాణలో కూడా సానుకూల వాతావరణం ఉందని.. దాన్ని గెలుపుగా మలచుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆప్ ను చీపురుతో ఊడ్చేశారు: బండి సంజయ్
ఢిల్లీలో బీజేపీ విజయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని తాము ముందే ఊహించామన్నారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో ఊడ్చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఢిల్లీలో ఆప్ నేతలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు వాగ్దానాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బండి సంజయ్ స్పష్టం చేశారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు తమకు వద్దని ఢిల్లీ ప్రజలు ఆప్‌ను వద్దనుకున్నారు. అవినీతి, అక్రమాలతో జైలుకు వెళ్లిన వ్యక్తిని ఢిల్లీ తిరస్కరించిందని బండి సంజయ్ అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని... రాష్ట్రపతిని, ప్రధానిలను ఎదిరించి వారికిష్టం వచ్చినట్లు ఢిల్లీలో కేజ్రీవాల్ పాలించిందన్నారు.
ఢిల్లీలో బీజేపీ హవా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేయడంతో కాషాయ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీకి 48కుపైగా స్థానాలు దక్కడంతో ఆ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. అధికార ఆప్ 22 స్థానాలకే పరిమతమయ్యేలా ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com