Bandi Sanjay: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. తెలంగాణలో కాక

Bandi Sanjay: బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. తెలంగాణలో కాక
Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ యాత్రలు, పొలిటికల్ పోరాటాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ యాత్రలు, పొలిటికల్ పోరాటాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో అడుగులు వేస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రాజకీయ వేదికలపై పరస్పరం మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ దద్దరిల్లుతోంది. పార్టీల సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ సెగలు రేపుతున్నాయి.


ఇక బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. తెలంగాణలో కాక రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికార పీఠాన్ని కైవసం చేసుకునేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసి.. ఆ దిశగా సాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికే నాలుగు విడతలను పూర్తి చేసుకుంది. అయితే ఐదో విడత బండి సంజయ్‌ పాదయాత్రకు పోలీసులు బ్రేకులు వేయడంతో హైటెన్షన్ నెలకొంది. బండి సంజయ్ సహా బీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్టుతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.



అయితే చివరికి హైకోర్టు అనుమతి, షరతులతో ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన బండి సంజయ్.. రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ సర్కారు టార్గెట్‌గా నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలన, ప్రజా వ్యతిరేక విధానాలు, టీఆర్ఎస్ అవినీతి అక్రమాలపై ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.


మూడోరోజు నిర్మల్‌ జిల్లా భైంసా మండలం గుండెగావ్‌ నుంచి పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్.. గుండెగావ్‌లో పల్సికర్‌ రంగారావు ప్రాజెక్టు ముంపు బాధితులతో సమావేశమయ్యారు. పత్తి చేనులో కూలి పనులు చేస్తున్న వారితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేయలేదని, పెన్షన్లు ఇవ్వడం లేదని స్థానికులు బండి సంజయ్‌కు వివరించారు. పల్సికర్ ముంపు బాధితులు, స్థానికుల గోడు విన్న అనంతరం బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.



ఉపాధి హామీ పథకం నిధులను కూడా కేసీఆర్‌ దారి మళ్లిస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. తెలంగాణలో పెద్దల రాజ్యం పోవాలి.. పేదల రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని సవాల్ విసిరిన బండి సంజయ్.. తమ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తామని, అన్ని ప్రభుత్వ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో కమలం నేతల్లో మంచి జోష్ నింపుతోంది.



మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రను వచ్చే ఎన్నికల వరకు ఉండేలా బీజేపీ ఇప్పటికే కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు విడతల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని.. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగిస్తున్నారు బండి సంజయ్. ఈ యాత్ర పూర్తి కాగానే కొన్ని రోజుల విరామం తర్వాత ఆరో విడత కూడా పాదయాత్ర చేపట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుండటంతో విడతల వారీగా కొనసాగేలా ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.



ఓవైపు పాదయాత్ర చేస్తూనే.. మరోవైపు బూత్‌స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసేలా వ్యూహాలు రచించారు కమలం నేతలు. ఇక ఇప్పటికే ఇతర పార్టీల నుంచి కీలక నేతలను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. మరికొందరు బలమైన నాయకులపైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇటీవల మర్రి శశిధర్‌రెడ్డి కమలం గూటికి చేరగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి మరికొందరు కీలక నేతలు వస్తారని బీజేపీలో టాక్ వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story