BJP: తెలంగాణను చుట్టేస్తున్న బీజేపీ అగ్రనేతలు

BJP: తెలంగాణను చుట్టేస్తున్న బీజేపీ అగ్రనేతలు
తెలంగాణలో ఊపందుకున్న బీజేపీ ముఖ్యనేతల ప్రచారం … మళ్లీ మోదీనే ప్రధాని అన్న నడ్డా

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుతున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలు తెలంగాణను చుట్టేస్తున్నారు. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామళై అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్యారెంటీలు అమలు చేయడం లేదనీ... అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెడుతోందని నేతలు ఆరోపించారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తంచేశారు.


తెలంగాణలో పోలింగ్‌ సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ ముఖ్యనేతల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులకు మద్దతుగా కీలక నేతలు ప్రచారం నిర్వహిస్తూ తెలంగాణను చుట్టేస్తున్నారు. పెద్దపల్లి, చౌటుప్పల్‌, నల్గొండలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా ప్రచారం నిర్వహించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్‌ నంబర్‌ వన్‌ అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఫార్మా, పెట్రో కెమికల్స్‌ రంగాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందన్న నడ్డా... మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో దేశీయ తయారీకి పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానంలో ఉందన్న ఆయన... త్వరలోనే మూడో స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌... ఒకే గూటి పక్షులన్న నడ్డా... రెండు ప్రభుత్వాలు కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు కాకుండా చేస్తున్నాయని విమర్శించారు.


జేపీకి ఓటర్లు వేసే ఒక్కో ఓటు మోదీని మరోసారి ప్రధానిగా చేయడమే కాకుండా... అభివృద్ధికర దేశంగా భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి అన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గం ముషీరాబాద్‌లో ఏర్పాటుచేసిన యువజన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అనంతరం మహబూబూబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి సీతారాం నాయక్ గెలుపు కోరుతూ నర్సంపేటలో నిర్వహించిన జనసభలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నేతలు నకిలీ వీడియోలు తయారు చేస్తున్నారన్న ధామి... రిజర్వేషన్లను ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై జమ్మికుంటలో ప్రచారం నిర్వహించారు. దేశానికి బండి సంజయ్‌ వంటి డైనమిక్‌ నాయకుడు కావాలని... ఆయనను చూసే తాను తమిళనాడులో పాదయాత్ర ప్రారంభించినట్టు అన్నామలై పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆయన... ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్‌ రెడ్డి... నకిలీ వీడియోలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌ నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యమని ప్రచారం చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story