BJP vs TRS : ఢిల్లీ లిక్కర్ స్కాంపై కొనసాగుతున్న బీజేపీ టీఆర్ఎస్ వార్..

BJP vs TRS : ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలతో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కవిత ఇంటిని ముట్టడించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించగా..వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులపై హత్యాయత్నం నమోదు చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న శ్రేణులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా తప్పు పట్టారు.
అధికార పార్టీతో పోలీసులు కుమ్మక్కయ్యారని..బాధితులపైనే కేసులు పెట్టడం దారుణమన్నారు. కేసులకు, టీఆర్ఎస్ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఇవాళ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు సంజయ్. ఇవాళ పాదయాత్ర శిబిరం దగ్గర నిరాహార దీక్ష చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కార్యకర్తల అరెస్టుతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించేందుకు సిద్ధమవడంతో పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ లీగల్ సెల్ నాయకులు స్టేషన్‌కు వచ్చి కేసుల నమోదుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనల్లో పాల్గొన్న 28 మంది ఆందోళనకారులను రిమాండ్‌కు తరలిస్తారని తెలుస్తోంది.
బీజేపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం పట్ల కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌కు బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్ర నిఘా వర్గాలు సైతం ఈ ఇష్యూకు సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నాయని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com