BJP: తెలంగాణలో పట్టుసాధించేందుకు బీజేపీ కసరత్తు.. రాజ్యసభ సీటు విషయంలో..

BJP: తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన బండి సంజయ్ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నాడన్న నమ్మకంతో ఉంది జాతీయ పార్టీ. దీంతో సంజయ్‌కి రాష్ట్ర పార్టీకి అండగా ఉండేందుకు జాతీయ నాయకత్వం పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చిందట. పార్టీని భలోపేతం చేసేందుకు మీ ప్రయత్నాలు మీరు చేయండి మేం చేయాల్సింది మేం చేస్తామంటూ ఏడాది క్రితమే జాతీయ నాయతక్వం నుండి రాష్ట్ర నాయకులకు సూచనలు అందయాట.
దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీభలోపేతం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర మొదలు పెడితే నాయకులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారట. ప్రజాసంగ్రామ యాత్ర రెండో విడత పూర్తి స్థాయిలో సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నారు బీజేపీ నేతలు. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో.. అమిత్ షా సహా పార్టీ జాతీయ నాయకత్వం కుషీగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చసాగుతోంది.
గత రెండేళ్లుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాష్ట్ర నాయతక్వం పూర్తి స్థాయిలో విజయవంతమయ్యిందని.. రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో పోరాటాలు కొనసాగించాలని సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ చేస్తున్న పోరాటాన్ని పార్టీ జాతీయ సమావేశాల్లో కూడా నేతలు ప్రస్తావిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు పార్టీ నేతలు. మరోవైపు పార్టీలో బలమైన నేతలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రజల్లోకి వెళ్లడం అంత కష్టం ఏమీ కాదని.. అధికారమే లక్ష్యంగా పనిచేయాలని జాతీయ నేతలు సూచించినట్టు తెలుస్తోంది.
ఇక రాష్ట్ర పార్టీకి అండగా ఉంటామంటూ చెప్పుకుంటూ వచ్చిన జాతీయ నాయకులు తమ మాటలను నిలబెట్టుకుంటున్నట్టుగా రాష్ట్ర నాయకులు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర నాయకత్వానికి కానీ.. కార్యకర్తలకు కానీ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా జాతీయ నేతలు తరలివస్తూ కేడర్‌లో భరోసా నింపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతుందని.. ఎవరూ అధైర్య పడకండంటూ తెలంగాణ పర్యటకు పెద్ద ఎత్తున వచ్చివెళ్తున్నారు జాతీయ నేతలు. కేవలం 20 రోజుల వ్యవధిలో ముగ్గురు అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు రావడం దీనికి సంకేతం అంటున్నారు.
ఇక పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ఇప్పటికే గతంలో ఎన్నడూ లేనన్ని జాతీయ పదవులు నేతలకు ఇచ్చింది నాయకత్వం. ఇక మరో పదవి కూడా పార్టీ నేతలను ఊరిస్తోందంటున్నారు నేతలు. తెలంగాణకు ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్లు చర్చజరుగుతోంది. ఈ రాజ్యసభ సీటుపై అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఏర్పాటైన నాటి నుండి తాను ఎన్నో త్యాగాలు చేసామని.. తమకు జాతీయ నాయకత్వం గుర్తింపు ఇస్తుందన్న ఆశలో ఉన్నారు బీజేపీ సీనియర్ నేతలు.
ఎన్ని ఇబ్బందులు వచ్చిన తట్టుకున్నామని.. ఏ బాధ్యతలు అప్పగించినా.. ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చామని గుర్తు చేస్తున్నారు బీజేపీ సీనియర్లు. ఇక పార్టీనే నమ్ముకుని బీజేపీలో చేరిన కొందరు నేతలు సైతం ఈ రాజ్యసభ సీటు తమకే వస్తుందన్న భావనలో ఉన్నారు. పార్టీలో చేరే సమయంలో ఎలాంటి షరతులు లేకుండా చేరామని.. పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామంటూ పార్టీలో చేరిన సీనియర్ నాయకులు చెప్పుకుంటున్నారు. పాత, కొత్త నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం పెద్దల సభకు వెళ్లే అవకాశం ఎవరికి ఇస్తుందో వేచి చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com