VenkataRamana Reddy: కామారెడ్డిలో కేసీఆర్ , రేవంత్‌లను ఓడించిన బీజేపీ

రాష్ట్రం మొత్తం ఆసక్తిరేపిన కామారెడ్డి నియోజకవర్గంలో భాజపా సంచలనం సృష్టించింది. ఆ పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి.. చరిత్రాత్మక విజయం సాధించారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డిని ఒకేసారి ఓడించి ఘనవిజయం సాధించారు. కామారెడ్డిలో మోదీ సభ కలిసి వచ్చిందని కమలం పార్టీ భావిస్తోంది.
కామారెడ్డి నుంచి భాజపా అభ్యర్థిగా పోటీచేసిన వెంకటరమణారెడ్డి.. చరిత్రాత్మక విజయం నమోదు చేశారు. భాజపా అభ్యర్థికి 65,198 ఓట్లురాగా భారాస అభ్యర్థి కేసీఆర్‌కు 59వేల 388ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి.. 54వేల 296 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 5వేల 810 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు. ప్రముఖులు పోటీచేయడం.. ఒక ఎత్తు అయితే రౌండ్‌రౌండ్‌కి ఆధిక్యం చేతులు మారడంతో ఉత్కంఠను రేపింది. ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లిన వెంకటరమణారెడ్డి చివరికి ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించారు.
2007లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ZP వైస్‌చైర్మన్‌గా పనిచేసిన వెంకటరమణారెడ్డి.. 2014 తర్వాత కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. నియోజకవర్గంలో వివిధ అంశాలపై పోరాటం చేశారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు విడుదల చేయాలని కలెక్టరేట్ వద్ద 48గంటలపాటు ఆమరణ దీక్ష చేయగా.. పోలీసులు భగ్నం చేశారు. ధరణి సమస్యలపై రైతుల పక్షాన పోరాటం చేసిన వెంకటరమణారెడ్డి.. భారాస నాయకులు అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ ఆందోళన చేపట్టారు. కామారెడ్డిలో భారాస నాయకులు అక్రమ వెంచర్లు వేసి ప్రజలను మోసం చేస్తున్నారని రిలే దీక్షలు చేశారు. రైతుల నుంచి భూ సమస్యలపై వినతులు సేకరించారు. డ్వాక్రా మహిళల తరపున వడ్డి లేని రుణాల మంజూరు కోసం ఆందోళన చేశారు. ప్రభుత్వం స్పందించి రుణాలు మంజూరుచేసింది. కామారెడ్డిలో శ్రీవారి వెంచర్‌ను అక్రమంగా అనుమతి లేకుండా చేశారని ఆరోపిస్తూ పెద్దఎత్తున ఉద్యమం చేయగా ఆ ప్రాజెక్టు అగిపోయింది. అనంతరం కామారెడ్డి మాస్టర్ ఆందోళనతో రాష్ట్రవ్యాప్తంగా వెంకటరమణారెడ్డి ప్రాచుర్యంలోకి వచ్చారు. మాస్టర్‌ప్లాన్‌లో భూములు కోల్పోతున్న 8 విలీన గ్రామాలు, మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చిన గ్రామాలకు తిరిగి.. రైతులను ఏకం చేశారు. తొలుత మున్సిపల్ కార్యాలయం ఎదుట రిలేదీక్ష చేపట్టారు. ఆ క్రమంలో ఓ రైతుఆత్మహత్య చేసుకోవడం.. ఉద్యమం ఉదృతమైంది. వివిధ రూపాల్లో నిరసన తెలిపిన బాధితులు.. పండుగలను నిరసనలకు వేదికగా చేసుకున్నారు. ఆ తర్వాత ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చి రైతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ ముట్టడించారు. అనంతరం రైతులు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేసింది. ఆ మొత్తం వ్యవహారంలో వెంకటరమణారెడ్డి.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ ఉద్యమాలు రమణారెడ్డికి ఎన్నికల్లో కలిసి వచ్చాయి. కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న బృహత్‌ప్రణాళిక బాధిత గ్రామాలు ఏకపక్షంగా ఆయనకు మద్దతు తెలిపి ఓట్లు వేయడంతో ఘనవిజయం సాధించారు. దేశంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని ఒకేసారి ఓడించిన ఏకైక వ్యక్తి రమణారెడ్డి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com