మరో వివాదంలో బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ..!

నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తనకు రావాల్సిన 30 లక్షల రూపాయలు ఇప్పించాలని అడిగిన కిరాణా షాపు యజమానిపై భోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ బూతుల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ముందు తనగోడు వెళ్లబోసుకున్నాడు. నిజామాబాద్ బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కిరాణా షాపు యజమానిని వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. రంజాన్ పండుగకు ఆర్డర్ ఇచ్చిన తోఫా ప్యాకెట్లకు సంబంధించిన డబ్బులు అడిగిన షాపు యజమాని మురళీధర్‌పై ఎమ్మెల్యే బూతు పురాణం మొదలెట్టారు. ఫోన్‌లో ఎమ్మెల్యే అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డింగ్‌ను బయటపెట్టాడు కిరాణా వ్యాపారి.
నాలుగేళ్ల క్రితం రంజాన్ పండుగకు బోధన్ ఎమ్మెల్యే షకీల్.. కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన రుద్రంగి మురళీధర్‌కు 6వేల తోఫా ప్యాకెట్లను ఆర్డర్ చేశాడు. ఒక్కోటి 600 రూపాయల చొప్పున 6 వేల ప్యాకెట్లకు ఆర్డర్ ఇవ్వగా.. ఎమ్మెల్యే 36 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. అడ్వాన్స్‌గా 12 లక్షల రూపాయలు చెల్లించిన ఎమ్మెల్యే.. మిగిలిన మొత్తాన్ని తర్వాత ఇస్తానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా క్యాటరింగ్ నిమిత్తం మురళీధర్‌కు మరో 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్యే షకీల్.. కిరాణా వ్యాపారికి మొత్తం 30 లక్షల వరకు బాకీ పడ్డారు. తన డబ్బులు ఇప్పించాలని మురళీధర్ రెండేళ్ల నుంచి ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నా ఆయన స్పందించడం లేదు. దీంతో బాధితుడు ఎమ్మెల్యే సన్నిహితుడి వద్ద బాధను చెప్పుకోగా ఆ వ్యక్తి ఎమ్మెల్యే షకీల్‌తో రెండు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడించాడు.
ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే షకీల్.. మురళీధర్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీకు ఎక్కడి డబ్బులు ఇచ్చేదిరా.. చెప్పుకోలేని రీతిలో దుర్భాషలాతుడూ కాల్ కట్ చేశారు. ఎమ్మెల్యే బూతు పురాణాన్ని సెల్‌ఫోన్లో రికార్డు చేసిన బాధితుడు మీడియా ఎదుట తన ఆవేదనను వెళ్లిబోసుకున్నాడు. బ్యాంక్ రుణం తీసుకుని షాపు పెట్టుకున్నానని, ఎమ్మెల్యే కారణంగా ఈఎంఐలు కట్టలేకపోవడంతో అధికారులు తన షాపును సీజ్ చేశారని మురళీధర్ వాపోతున్నాడు. తనకు న్యాయం చేయాలని బోధన్ ఏసీపీని ఆశ్రయిస్తే కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎమ్మెల్యే కారణంగా తన కుటుంబం రోడ్డున పడిందని, తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com