Bonalu : అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ అమ్మవారి బోనాలు.. పోటెత్తిన భక్తులు

Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తుల తాకిడి పెరిగింది. ఉదయం 4 గంటలకు మహాహరతి, కుంకుమ, పుష్ప అర్చనల నుడమ ఘటోత్సవంతో... బోనాల వేడుక వైభవంగా ప్రారంభమైంది.
అటు మహంకాళి అమ్మవారికి తెలంగాణ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు... పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి...బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అటు ఉదయమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి అమ్మవారికి బోనం సమర్పించారు. బోనాల పండుగ సందర్భంగా నగరవాసులకు కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. బోనాల పండుగతో భాగ్యనగరం ఖ్యాతి కెక్కిందన్నారు.
అటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుటుంబసభ్యులతో కలిసి బోనాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అటు మహంకాళి అమ్మవారిని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
మహాకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో...రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ఆలయాన్ని పూలు, తోరణాలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com