సూర్యాపేటలో బాలుడి మిస్సింగ్ కేసు సుఖాంతం

సూర్యాపేటలో శనివారం రాత్రి అపహరణకు గురైన ఐదేళ్ల బాలుడు గౌతమ్... తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేరాడు. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని విడిపించిన పోలీసులు.... నిందితుల్ని అరెస్టు చేశారు. కేసు పూర్తి వివరాల్ని పోలీసులు సోమవారం వెల్లడించనున్నారు. మరోవైపు.. క్షణక్షణం ఉత్కంఠను కలిగించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. ఎస్పీ భాస్కరన్ ఆదేశాలతో బాలుడు గౌతమ్ మిస్సింగ్ కేసును వేగంగా దర్యాప్తు చేశారు.
సూర్యాపేటలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన మహేశ్, నాగలక్ష్మి దంపతుల కుమారుడు గౌతమ్ శనివారం రాత్రి 9 గంటలకు టపాసులు కొనుక్కునేందుకు తల్లిదండ్రుల వద్ద 50 రూపాయలు తీసుకుని... వెళ్లాడు. బాలుడు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందారు. టపాసులు కొనుక్కుని వెళ్లిపోయాడని... షాపు యజమాని తెలిపాడు. అక్కడికి కొంత దూరంలో గౌతమ్ సైకిల్ కనిపించింది. తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు.
కేసులో ఓ ఫోన్‌కాల్ కీలకంగా మారింది. కిడ్నాపర్లు బాలుడి ఇంటి పక్కన ఉన్న ఓ టైలర్‌కు ఫోన్ చేశారు. మీ అబ్బాయి గౌతమ్‌ను కిడ్నాప్ చేశామని తెలిపారు. గౌతమ్ మా అబ్బాయి కాదని ఆ టైలర్ ఫోన్ పెట్టేశారు. అయితే.. తమ ఇంటి సమీపంలో గౌతమ్ అనే బాలుడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకుని... ఫోన్‌కాల్ విషయం పోలీసులకు తెలిపారు. ఆ ఫోన్‌కాల్ ఆధారంగానే కేసును చేధించినట్టు తెలుస్తోంది. కిడ్నాప్ ఘటన నుంచి బాలుడు క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com