BRS : తెలంగాణ బయట మొదటి సభ.!

BRS : తెలంగాణ బయట మొదటి సభ.!
రాష్ట్రం వెలుపలా తొలిసారి నిర్వహిస్తున్న సభ కావడంతో..దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు.

గులాబీ బాస్ మరికాసేపట్లో నాందేడ్ బయల్దేరనున్నారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణపై ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్, మరింత దూకుడు పెంచారు. తెలంగాణ దాటి తొలిసారి మహారాష్ట్ర నాందేడ్‌లో రెండో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రం వెలుపలా తొలిసారి నిర్వహిస్తున్న సభ కావడంతో..దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీఆర్‌ఎస్‌ శ్రేణులు. బహిరంగ సభను సక్సెస్‌ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభాస్థలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నాందేడ్‌తో పాటు నలుదిక్కుల కిలోమీటర్ల మేర గులాబీమయంగా మారింది. భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు ఆకట్టుకుంటున్నాయి.

హైదరాబాద్ నుంచి నాందేడ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి సభా వేదిక సమీపంలో ఉన్న చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు కేసీఆర్‌. అనంతరం గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత సభాస్థలికి చేరుకుంటారు. సభలోనే సీఎం కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు గులాబీ కండువా కప్పుకోనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగిస్తారు. సభలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించనున్నారు కేసీఆర్‌.

నాందేడ్‌ సభను సక్సెస్‌ చేసేందుకు ఆదిలాబాద్,నిజామాబాద్‌కు చెందిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు వారం రోజులుగా అక్కడే మకాం వేశారు. సభ ఏర్పాట్లను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, షకీల్‌ సహా పలువురు నేతలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. భారీ జనసమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నాందేడ్‌ బహిరంగ సభతో దేశవ్యాప్తంగా ఆకర్షించేందుకు కేసీఆర్‌ అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ సభ విజయవంతం తర్వాత మరిన్ని రాష్ట్రాలపై కేసీఆర్ పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆరేడు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. నాందేడ్ సభ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రల్లో బీఆర్‌ఎస్‌ శాఖల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story