BRS Campaign : పెరిగిన కారు జోరు..

BRS Campaign : పెరిగిన కారు జోరు..
ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ దూకుడు

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోకారు జోరు.. మరింత పెంచుతోంది. ఇప్పటికే ప్రచార పర్వంలో ముందున్న భారాస అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి KCR రంగంలోకి దిగనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మహబూబాబాద్‌, వర్దన్నపేట, పాలేరు సభలకు KCR.హాజరవనున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారపర్వాన్ని మరింత ఉరకలెత్తించేలా నేతలు, గులాబీ శ్రేణులకు KCR దిశానిర్దేశం చేయనున్నారు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నిర్వహించనున్న తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభనుప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు దిగ్విజయం చేయాలన్న సంకల్పంతో భారీ ఏర్పాట్లు చేశారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు గులాబీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. కూసుమంచి మండలం జీళ్లచెర్వులో 25 ఎకరాల్లో బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 80 వేల మందిని తరలించేలా జనసమీకరణ చేస్తున్నారు. KCR సెంటిమెంట్ ప్రకారం తూర్పు దిక్కుగా భారీ సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం గ్రామీణం, తిరుమలాయపాలెం మండలాల నుంచి భారీగా కార్యకర్తలు రానున్నారని పాలేరు MLA కందాల ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధిపైనా ప్రజలకు KCR స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశం ఉంది. పాలేరు సభ అనంతరం మహబూబాబాద్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వద సభకు ముఖ్యమంత్రి KCR హాజరుకానున్నారు. CM బహిరంగ సభ కోసం మానుకోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పట్టణ కూడళ్లు గులాబీమయంగా మారాయి. హెలీప్యాడ్, సభా ప్రాంగణంలో ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, MP కవిత, MLA శంకర్ నాయక్‌ పరిశీలించారు. మూడోసారి భారాస అధికారంలోకి రావటం ఖాయమని మంత్రి సత్యవతి స్పష్టం చేశారు.అనంతరం వర్దన్నపేట సభకు KCR హాజరవుతారు. సభ ఏర్పాట్లను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, MLA ఆరూరి రమేష్‌ పరిశీలించారు. భారీగా వచ్చే జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.


ప్రత్యర్థి పార్టీల కంటే చాలా ముందుగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించింది. టిక్కెట్లు ఖరారైన రోజు నుంచే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. అన్ని సెగ్మెంట్లలో అభ్యర్థులు ఇప్పటికే ఒక దశ ప్రచారం పూర్తి చేశారు. నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశాలు, ఆ తర్వాత మండల స్థాయి సమావేశాలు పూర్తయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఊర్ల వారీగా.. నగరాల్లో డివిజన్ల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం పూర్తి చేశారు. కొన్ని సెగ్మెంట్లలో గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం సైతం పూర్తవుతున్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం, సొంత రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి ప్రధాన ఎజెండగా బీఆర్‌ఎస్‌ ప్రచారం సాగుతున్నది.

Tags

Read MoreRead Less
Next Story