BRS: ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం

హనుమకొండలో బీజేపీ శ్రేణుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించగా... బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలు, రాళ్లతో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ దాడిలో ఇరు వర్గాలకు గాయాలయ్యాయి. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ఇరు వర్గాలపై లాఠీ చార్జీ చేశారు.
ఇవాళ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఇంటిని ముట్టడించాలని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు బీజేపీ శ్రేణులు ఉదయం చేరుకున్నాయి. క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కర్రలు, రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు పద్మను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి బయటకు రావడంతో అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు బీజేపీ శ్రేణులు వినయ్ భాస్కర్ ఇంటి ముందు ఆందోళనకు దిగే అవకాశం ఉందని గుర్తించిన పోలీసులు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి వచ్చిన బీజేపీ శ్రేణులను బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com