BRS: జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. షేక్పేట్ తహసీల్దార్ ఆఫీస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ముఖ్య నేతలతో వెళ్లి తొలి సెట్ నామినేషన్ చేశారు. కాగా, ఈ ఉపఎన్నికను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. నామినేషన్ వేయడానికి వెళ్లేముందు తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదు.. పదేండ్ల అభివృద్ధి పాలనకు, రెండేండ్ల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు.
పదేళ్ల రైతుబంధు పాలనకు, రెండు సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని చెప్పారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారు. ఈమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నారని అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతీ యువకులు సునీత గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇండ్లు కోల్పోయిన హైడ్రా బాధితులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల మద్దతుతో, అండతో బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నదని జోస్యం చెప్పారు. గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. ఈనెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com