BRS: ప్రజా క్షేత్రంలో గులాబీ పార్టీ

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ యూరియా కొరత అంశంపై బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు గన్‌పార్క్‌కు చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు “గణపతి బప్పా మోరియా, కావాలయ్యా యూరియా” నినాదాలతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా నినాదాలు చేశారు. రైతులు ఎరువుల కొరతను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
అసెంబ్లీ నుంచి ర్యాలీ
రైతుల సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్ కార్యాలయానికి ర్యాలీ చేశారు. అక్కడ అధికారులు కు వినతిపత్రం అందించి యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తర్వాత వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందుకు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యలపై పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.
సచివాలయం వద్ద ధర్నా
ఆందోళన కొనసాగిస్తూ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ సచివాలయం వద్దకు చేరారు. ఖాళీ యూరియా సంచులతో బారీకేడ్లను దాటారు. హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు సచివాలయం గేట్లకు పరుగులు పెట్టి నిరసన తెలిపారు. రైతుల సమస్యలను ప్రాధాన్యం ఇవ్వాలని, రాజకీయాల కోసం రైతులతో ఆడుకోవద్దని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
రాజకీయ వాదనలు
యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యులు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామన్నారు. యూరియా కొరతపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం బీఆర్ఎస్ నేతలు ఆందోళన కొనసాగిస్తారని, అవసరమైతే మరిన్ని ధర్నా చేపట్టుతామని, రైతు సమస్య తీరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని హరీశ్ స్పష్టం చేశారు.
గులాబీ పార్టీ వ్యూహం అదేనా..?
సభ వాయిదా పడిన తర్వాత నుంచి బీఆర్ఎస్ విశ్వరూపం చూపించింది. ఎరువుల కొరత ఎప్పుడు తీరుస్తారని వ్యవసాయ కమిషన్ కార్యాలయానికి వెళ్లారు. ప్రభుత్వంతో మాట్లాడి సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదని బైఠాయించారు. అక్కడకు పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేయడంలో కాసేపు హైడ్రామా నడిచింది. ప్రజా ఉద్యమాలు చేయనిదే ఏ పార్టీ అయినా నేత అయినా ప్రజల మనన్నలు పొందలేడు. నిత్యం ఏదో సమస్యపై పోరాడుతూ ప్రజల్లో ఉంటేనే వాళ్లకు గుర్తింపు ఉంటుంది. 202౩లో అనూహ్యంగా ఓటమి చవి చూసిన బీఆర్ఎస్ ఒక్కసారిగా డీలాపడిపోయింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ అయితే బయటకు రావడమే మానేశారు. అప్పుడప్పుడు బహిరంగ సభలు పెట్టారే తప్ప మరో చోట కనిపించడం లేదు. దీంతో పార్టీ కేడర్ పూర్తిగా నైరాశ్యంలో మునిగిపోయింది. కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్లు ప్రజల్లో ఉంటున్నా అనుకున్నంత మైలేజీ రావడం లేదు. యూరియా కొరతపై సభలో చర్చించాలని బీఆర్ఎస్ గట్టిగా పట్టుబడుతోంది. ఇదే విషయంపై సభను స్తంభింపజేయనుంది. కార్యాకలాపాలను అడ్డుకోనుంది. అవసరం అయితే సభలో వేటు వేయించుకొని ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చింది. దీంతో బలనిరూపణ చేసుకొని ప్రజల్లో మరోసారి సత్తా చాటుకోవాలని స్కెచ్ వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com