BRS: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాయిదా

ఈ నెల 19న నిర్వహించాల్సిన బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా సమావేశంలో పాల్గనడం కోసం వాయిదా వేశారు. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని పార్టీ స్పష్టం చేసింది. ఈ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొంటారని పేర్కొంది. ఇక ఈ సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జలాలపై కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి, పార్టీ సంస్థాగత నిర్ణయం, కార్యచరణ, రాబోయే రోజుల్లో ప్రజా ఉద్యమాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశానికి మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ రాజకీయ ప్రసంగం చేయనుండడంతో తెలంగాణలో ఆసక్తి నెలకొంది.
ప్రతి దాడి
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన కేటీఆర్, బాధితుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడ్డ గంజి భారతి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెల్విస్ ఎముకలు విరిగిపోయాయని, యూరినరీ బ్లాడర్ దెబ్బతిన్నదని డాక్టర్లు తెలిపారు. ఆమెకు మూడు శస్త్రచికిత్సలు చేయాల్సి ఉందని, కనీసం మూడు వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ నుండి కింది స్థాయి పోలీసుల వరకు అందరికీ గుర్తుచేస్తున్నా.. మీకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే తప్ప, రేవంత్ఇంట్లో సొమ్ముతోనో, కాంగ్రెస్ సొమ్ముతోనో కాదు.. ప్రజల ప్రాణాలు పోతుంటే, రౌడీలు దాడులు చేస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూడటం పద్ధతి కాదని హెచ్చరించారు. పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తూ, నిందితులపై చర్యలు తీసుకోకపోతే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.. దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

