KCR: కాంగ్రెస్ సర్కార్‌ను చీల్చి చెండాడుతాం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలనూ మోసం చేసిందని, అందర్నీ వెన్నుపోటు పొడిచిందని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. బడ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శత్రు ప్రభుత్వంగా తేలిపోయిందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా శాసనసభలోకి తొలిసారి అడుగుపెట్టిన కేసీఆర్... బడ్జెట్ ప్రసంగం పూర్తికాగానే వెలుపలికి వచ్చి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కేసీఆర్ అక్కడికి వస్తారని మీడియా ప్రతినిధులు సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఊహించలేదు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కేసీఆర్ మాట్లాడడం ఇదే తొలిసారి.
తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లుజల్లిందని... వాస్తవానికి దూరంగా ఉందని కేసీఆర్ మండిపడ్డారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం లేదని,,. భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ఒత్తి ఒత్తి పలకడం తప్ప ఇందులో ఏమీ కనిపించలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తమకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని కేసీఆర్ అన్నారు. ఏ సంక్షేమ పథకమూ ఇందులో లేదన్నారు. బడ్జెట్‌లో ముఖ్యమైన పథకాల ప్రస్తావనే లేదన్నారు. గొర్రెల పంపిణీ పథకం, దళితబంధు, రైతుభరోసా తదితరాలకు కేటాయింపులే లేవని కేసీఆర్ విమర్శించారు. రైతులను పొగిడినట్టే పొగిడి వెన్నుపోటు పొడిచారన్నారు.
తాము రెండు పంటలకు రైతుబంధు ఇచ్చామని.... ఇప్పుడు రైతుభరోసా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రైతులను, వృత్తి కార్మికులను ఈ ప్రభుత్వం వంచించిందన్నారు. రైతుల సంక్షేమం కోసం ఖర్చుపెట్టిన డబ్బులను మేమేదో దుర్వినియోగం చేశామని ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వమే రైతు శత్రు ప్రభుత్వమన్నారు. రైతుభరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లు చెప్పారు. దళితబంధు ప్రస్తావనే లేదని... గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారని అన్నారు. ఈస్ట్ మన్ కలర్‌లో కథ చెప్పినట్టే ఉందే తప్ప... బడ్జెట్ పెట్టినట్టు లేదు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక సమయమివ్వాలని ఆరు నెలలపాటు అసెంబ్లీకి రాలేదని కేసీఆర్ అన్నారు. గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసే బడ్జెట్ ఇదని మండిపడ్డారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని... ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని రూపొందించలేదన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com