BRS: హైదాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తిచేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంకు అభ్యర్థిని ప్రకటించడంతో రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లయింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారిగా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించారు. ఆరు నియోజకవర్గాల్లో (జహీరాబాద్, నిజామాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి, హైదరాబాద్) బీసీలకు టికెట్లు కేటాయించారు. నాలుగు నియోజకవర్గాల్లో (మహబూబ్ నగర్, మెదక్, మల్కాజిగిరి, నల్గొండ) రెడ్డి సామాజిక వర్గం వారికి, కమ్మ (ఖమ్మం), వెలమ (కరీంనగర్) సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించారు. మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో (మహబూబాబాద్, అదిలాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి) ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాల అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com