KTR: మైనార్టీ నేతలతో బీఆర్‌ఎస్ భేటీ

త్వరలోనే మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమవుతోంది. హైదరాబాద్ నేతలతో లోక్‌సభ సన్నాహక సమావేశాల్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఈ మేరకు నేతలకు స్పష్టం చేశారు. తమకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పార్టీలో ఎన్నాళ్లు పనిచేయాలని పాతబస్తీ నేతలు ప్రశ్నించారు. అటు నియోజకవర్గాల్లోని వర్గపోరు... సమావేశాల్లో కాస్త బయటపడినట్లైంది. లోక్ సభ సన్నాహకాల్లో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో బీఆర్‌ెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ఇటీవల శాసనసభ ఎన్నికల ఫలితాలపై సమీక్షలతో పాటు లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. రాజధాని ఓటర్లు అభివృద్ధికి పట్టం కట్టి బీఆర్‌ఎస్‌పై విశ్వాసం ప్రకటించారన్న నేతలు సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో పూర్తి మెజార్టీ ఉందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని... పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని గెలిపిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
శాసనసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి సమావేశంలో స్థానం లేదని ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తెలంగాణ భవన్ వెలుపల ఇరువర్గాల అనుచరుల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట కూడా జరిగింది. మరో ఎమ్మెల్యేపై సమావేశంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడంతో... వ్యతిరేకవర్గం అందుకు అడ్డుచెప్పింది. ప్రత్యేకించి పాతబస్తీకి చెందిన పలువురు మైనార్టీలు ఆవేదన వ్యక్తం చేశారు. మజ్లిస్‌తో స్నేహం అంటూ సొంత పార్టీ వారికి కనీసం పట్టించుకోపోతే ఎలా అని ప్రశ్నించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు కొందరు నాయకులు తగిన గుర్తింపు ఇవ్వలేదని...ఉద్యమకారులను పట్టించుకోలేదని అసంతృప్తిని వెల్లగక్కారు. ఒక ఉద్యమకారుడిని కేటీఆర్ వెంట తీసుకెళ్లి బుజ్జగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీజేపీతో మైత్రి దుష్ప్రచారమని కేటీఆర్ కొట్టిపారేశారు. బీజేపీతో బీఆర్‌ఎస్ ఎన్నటికీ కలవబోదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కేసీఆర్ ప్రభుత్వం ఇన్ని ఫ్లైఓవర్లు పూర్తి చేస్తే... కేంద్రం నిర్మిస్తున్న ఉప్పల్ ఫ్లై ఓవర్ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేవలం రైల్వే స్టేషన్లలో లిఫ్ట్‌ల ప్రారంభానికి మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. త్వరలోనే మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై అన్ని అంశాలపై చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారని, మంత్రిగా కేటీఆర్ చేసిన కృషి కూడా రాజధాని ఓటర్లను పార్టీ వైపు ఆకర్షించిందని పార్టీ సీనియర్ నేత కేశవరావు అన్నారు. కార్యకర్తలు లేనిదే పార్టీ లేదన్న ఆయన... జెండా మోసిన ప్రతిఒక్కరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఉద్యమకారుల్లో ఉన్న అసంతృప్తిని గుర్తించామన్న కేకే... వారికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com