Telangana: ఉచిత విద్యుత్ పై రాజకీయ మంటలు

తెలంగాణలో ఉచిత విద్యుత్ మంటలు ఆరడం లేదు. కాంగ్రెస్ - బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు భగ్గుమంటుండగా.. ఆయన మాటల్ని వక్రీకరించారంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తుందో లేదో తేలాలంటే సబ్‌స్టేషన్ల వద్దకు రావాలంటూ కాంగ్రెస్ సవాల్ విసిరింది. 24 గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలలో ఒకటని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయమంతా ఉచిత విద్యుత్ చుట్టూనే తిరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తుంది అంటూ ట్వీట్ చేశారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఎందుకు 24 గంటల కరెంట్ రైతులకు అందుబాటులో ఉండకూడదో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకత్వం 24 గంటలు ఇవ్వాలని నిర్ణయిస్తే.. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అన్నారు. చత్తీస్‌గఢ్‌లో కరెంట్ పుష్కలంగా ఉన్నా 24 గంటలు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు కరెంట్‌ను అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
రైతులకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం నాలుగైదు గంటలు మాత్రమే కరెంటు వచ్చేదన్నారు. నాడు తెలంగాణకు అన్యాయం జరుగుతోందని మొదట స్పందించిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇదే అంశంపై రెఫరెండం కోరదామని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com