బీఆర్ఎస్, కమ్యునిస్టు పార్టీల బంధం ఇంతేనా..!?

బీఆర్ఎస్, కమ్యునిస్టు పార్టీల బంధం ఇంతేనా..!?
లెఫ్టు పార్టీలు అపాయింట్మెంట్ కోరినా.. సీఎంఓ నుంచి ఎందుకు స్పందన లేదు...?

మునుగోడుతో ఏర్పడిన కారు, కొడవళ్ళ బంధం కంటిన్యూ అవుతుందా..? రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేసే పరిస్థితులు ఉన్నాయా..? తాజా పరిణామాల నేపథ్యంలో మైత్రి లేనట్టే భావించాలా..? కనీసం లెఫ్టు పార్టీలు అపాయింట్మెంట్ కోరినా.. సీఎంఓ నుంచి ఎందుకు స్పందన లేదు...? లెఫ్ట్ పార్టీల స్పీడ్ కంట్రోల్ చేసేందుకే కేసీఆర్‌ సైలెంట్‌గా ఉన్నారా...? తెలంగాణ వచ్చాక సీబీఐ, సీపీఎం పార్టీలను అధికార బీఆర్ఎస్ పార్టీ లైట్‌గా తీసుకుంది.. కానీ మునుగోడు ఉప ఎన్నిక తరుణంలో కేసీఆర్ కొత్త సమీకరణాలకు తెరలేపారు. మునుగోడు ఉప ఎన్నికలో లెఫ్ట్ పార్టీలతో అధికార బీఆర్ఎస్‌కు మైత్రి కుదిరింది. బైపోల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపొందడంతో లెఫ్ట్ పార్టీలతో స్నేహం కొనసాగుతుందని అధికార పార్టీ ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తామంటూ గులాబీ బాస్ ప్రకటించారు.

తాజా పరిణామాలు చూస్తే ఇకపై అధికార బీఆర్ఎస్‌కు.. లెఫ్ట్ పార్టీలకు మధ్య సఖ్యత ఉండదన్న సందేహాలు నెలకొన్నాయి. కలిసి పనిచేస్తామన్న పార్టీలకు కనీసం కేసీఆర్‌ అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని లెఫ్ట్ పార్టీల నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు... సీట్ల పంపకం వంటి అనేక అంశాలపై చర్చించాలని సీపీఐ, సీపీఎం నేతలు భావించారు. అయితే.. కేసీఆర్‌ టైమ్‌ ఇవ్వకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రగతి భవన్‌కు విందుకు ఆహ్వానించిన కేసీఆర్.. ఈ రెండు పార్టీల నేతలను ఎందుకు దూరం పెట్టారు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీపీఐ, సీపీఎం పార్టీలు స్పీడ్ పెంచాయి. సభలు.. సమావేశాలతో తమ బలం ఏంటో అధికార పార్టీకి తెలియజేసి సీట్లు పంచుకోవాలని ఈ రెండు పార్టీలు భావించాయి. మునుగోడు గెలుపు తర్వాత బీఆర్‌ఎస్‌కు తమతో పొత్తు బాగా అవసరం ఉందన్న సంకేతాల్ని ఇచ్చే ప్రయత్నం చేశాయి లెఫ్ట్‌ పార్టీలు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా సీట్లు దక్కించుకొని.. తెలంగాణలో తమ ఉనికి కోల్పోలేదని బలంగా చెప్పాలని ఆ పార్టీలు భావించాయి. ఇదే క్రమంలో అనేక కార్యక్రమాలతో సీపీఐ, సీపీఎంలు ఎన్నికలకు తాము సిద్ధమని చాటాయి. ఈ కారణం వల్లే లెఫ్ట్ పార్టీలపై కేసీఆర్‌ కొంత అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్క మునుగోడు ఉపఎన్నిక గెలుపుతో.. కమ్యూనిస్టుల అండ లేకపోతే అధికార పార్టీకి ఇబ్బందులు వస్తాయన్న ప్రచారం కేసీఆర్‌కు మింగుడు పడడం లేదట. ఎన్నికల పొత్తు కుదరక ముందే కమ్యూనిస్టు నేతలు సభలు.. సమావేశాలు పెడుతూ తాము ఈ నియోజకవర్గంలో బరిలో ఉంటాం.. ఆ నియోజకవర్గంలో బరిలో ఉంటాం అంటూ ప్రకటనలు చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న కేసీఆర్... లెఫ్ట్ పార్టీల నేతల స్పీడ్‌ను కంట్రోల్ చేసేందుకు కొద్దికాలం సైలెంట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో కమ్యునిస్టు పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశంలో... రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులకు సంబంధించి అధికార పార్టీ తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్న లెఫ్ట్ నేతలు... బీఆర్ఎస్‌తో పొత్తు కుదరకపోతే ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించారు. ఒకరు పోటీ చేసే నియోజకవర్గంలో మరొకరు పోటీ చేయకూడదని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు కమ్యూనిస్టులు. బీఆర్ఎస్తో పొత్తు కుదరక పోతే .. కమ్యునిస్టు పార్టీలుగా ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెబుతున్నారు.

పొత్తుల కోసం ఎదురు చూడబోమన్నారు. సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగాం.. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్న లెఫ్ట్‌ నేతలు...ఇక బీఆర్ఎస్ పిలుపు కోసం ఎదురు చూడబోమని తెగేసి చెప్తున్నారు. తాము బలంగా ఉన్న స్థానాల్లో తమ కార్యక్రమాలు చేసుకుంటున్నామని...సీపీఐ, సీపీఎంలు కలిసే ఈ సారి పోటీ చేస్తాయని ప్రకటించారు.

అయితే ఇప్పటి వరకు మునుగోడులో ఇచ్చిన హామీకే కేసీఆర్ కట్టుబడి ఉన్నాడకుంటున్నామని...ఆ హామీ ఆయన వెనక్కి తీసుకోలేదని లెఫ్ట్ పార్టీల నేతలు అంటున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్టు పార్టీల మధ్య తాజా పరిణామాలు చూస్తే వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి.

Tags

Next Story